ఇన్‌స్టాగ్రామ్ ప్రేమకు ఓ యువతి బలి కాగా.. మరో యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఒకే అబ్బాయిని ప్రేమించిన ఇద్దరు యువతులు.. అతడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాల్లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బత్తులపల్లి మండలం గరిసినపల్లెకు చెందిన దివాకర్ అనంతపురంలో ఓ లోన్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ముదిగుబ్బకు చెందిన షేక్ రేష్మాతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. అప్పుడప్పుడు కలుసుకుని మాట్లాడుకునేవారు. ఈ విషయం అమ్మాయి వాళ్ల ఇంట్లో తెలిసింది. దీంతో రేష్మకు పెళ్లి చేశారు.
పెళ్లి చేసిన కొన్ని రోజులకే భర్తను వదిలేసిన రేష్మ తన సొంతూరుకు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ దివాకర్‌ను కలవడం మొదలుపెట్టింది. అటు దివాకర్ తన చెల్లి ఫ్రెండ్, కణేకల్లు మండలం ఎర్రగుంటకు చెందిన శారదతో పరిచయం పెంచుకున్నాడు. శారద.. అనంతపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. గుల్జార్‌పేటలో ఓ హాస్టల్‌లో ఉంటోంది. ఇన్‌స్టాలో దివాకర్ తనతో పాటు మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని శారద తెలుసుకుంది. ఈ విషయమై దివాకర్‌ను నిలదీసింది.
ఇలా ముగ్గురి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రియురాళ్లను ఇద్దరినీ ఒకేచోట కూర్చొబెట్టి మాట్లాడాలని దివాకర్ భావించాడు. శారద ఉంటున్న హాస్టల్‌కు రేష్మను తీసుకొని వచ్చాడు. ముగ్గురూ గదిలో కూర్చుని మాట్లాడుకున్నారు. పెళ్లి చేసుకోవాలని యువతులు పట్టుబట్టడంతో, ఎవరినీ చేసుకోనంటూ దివాకర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన యువతులు నగరంలోని ఆర్టీవో కార్యాలయం ఎదుట విషం తాగారు. స్థానికులు వారికి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శారద మృతి చెందగా.. రేష్మ చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.