గుంటూరులో విషాదం.. మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కార్మికులు మృతి
Two Workers died while working Mutliplex Construction.గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనులు
By తోట వంశీ కుమార్ Published on 16 March 2022 1:25 PM ISTగుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనులు చేస్తుండగా.. మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. అమరావతి రోడ్డులోని ముత్యాలరెడ్డి నగర్‌లో మల్టీపెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెల్లార్ పునాధుల కోసం దాదాపు 20 నుంచి ౩౦ అడుగుల లోతు వరకు వరకు తవ్వారు. అందులో ఐరన్ రాడ్‌ల బెండింగ్‌కు సంబంధించిన పనులు చేస్తున్నారు.
ఈ పని చేస్తుండగా పూడిక తీసిన భాగంలో మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. అక్కడే పనిచేస్తున్న కార్మికులు మట్టిపెళ్లల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మట్టిపెళ్లల కింద నలిగిపోయి చనిపోయిన ఇద్దరు కార్మికుల మృతదేహాలను బయటకు తీశారు. ముగ్గరు ప్రాణాలతో బయటపడగా.. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా బీహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు.
ఘటనాస్థలికి హుటాహుటిన నగర మేయర్, కమిషనర్ వచ్చారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, వారికి అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు. జీ ఫ్లస్ 6 భవన నిర్మాణానికి దరఖాస్తు చేశారని అయితే.. ప్లానింగ్‌లో లోపాలు ఉండటంతో అనుమతులు ఇవ్వలేదని, లోపాలు సరిచేసే వరకు పనులు ఆపాలని యాజమాన్యానికి సూచించినట్లు గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు.
గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ.. కార్పొరేషన్ అనుమతి లేకుండా సెల్లార్ నిర్మాణానికి పనులు చేపట్టారన్నారు. దీనికి బాధ్యులైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.