టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా కొందరు ఇంకా మూఢనమ్మకాలను వీడడం లేదు. నరబలి ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయనే మూఢ నమ్మకంతో దంపతులు దారుణానికి తెగబడ్డారు. ఇద్దరు మహిళలను బలిఇచ్చారు. ఈ దారుణ ఘటన కేరళ రాష్ట్రంలోని పత్తినంతిట్టలో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. తిరువళ్లలో భగవంత్ సింగ్, లైలా దంపతులు నివసిస్తున్నారు. మహిళలను బలి ఇస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోవడంతో ఆపార సిరిసంపదలు కలుగుతాయని ఎవరో చెప్పిన మాటలను విశ్వసించారు. ఇందుకు మహ్మద్ షఫీ సాయం తీసుకున్నారు. షఫీ సోషల్ మీడియాలో కడవంతర, కాలడీలకు చెందిన ఇద్దరు మహిళలతో స్నేహం చేశాడు. వీరిద్దరు లాటరీ టికెట్లు అమ్ముకుని జీవించేవారు. వీరిలో ఒకరు జూన్, మరొకరు సెప్టెంబర్ నుంచి కనిపించకుండా పోయారు.
కేసు నమోదు చేసిన పోలీసులు షఫీని అదుపులోకి తీసుకుని విచారించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మహిళలు ఇద్దరిని భగవంత్ సింగ్, లైలా దంపతులు నరబలి ఇచ్చినట్లు చెప్పాడు. పెరుంబవూరులోని ఓ వ్యక్తిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో మంచి లాభాలతో పాటు ఆశించిన ఫలితాలు వస్తాయని మహిళలను నమ్మించి వారి ఇంటికి తీసుకువెళ్లినట్లు తెలిపాడు.
మంత్రాలు చేసి భగవంత్‌సింగ్ ఇంట్లోనే జూన్‌లో ఒకరిని సెప్టెంబర్‌లో మరో మహిళను గొంతుకోసి చంపారు. అనంతరం మృతదేహాలను ముక్కలుగా నరికి ఆ ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టారు. ఈ ఘటనలో దంపతులతో పాటు షపీని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతులను పద్మం(52), రోస్లీ(50)గా గుర్తించారు.