కర్నూలు జిల్లాలో దారుణం.. తోడి కోడళ్లను చంపిన మామ.. సహకరించిన భర్తలు
Two women killed by father-in-law in Orvakal under suspicion of carrying out exorcism. కర్నూలు జిల్లా ఓర్వకల్‌లో భూతవైద్యం చేస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు కోడళ్లను మామ దారుణంగా
By అంజి Published on 16 Dec 2022 11:04 AM IST
కర్నూలు జిల్లా ఓర్వకల్‌లో భూతవైద్యం చేస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు కోడళ్లను మామ దారుణంగా హత్య చేశాడు. ఇందుకోసం కొడుకుల సాయం తీసుకున్నాడు. ఓర్వకల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నన్నూరు గ్రామానికి చెందిన కురువ మంగమ్మ, పెద్ద గోవర్ధన్ (అలియాస్ గోవన్న) దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు పెద్ద రామ గోవింద్‌కు గూడూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన రామేశ్వరమ్మ(26)తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. చిన్న కుమారుడు చిన్న రామగోవింద్‌కు కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రేణుక(25)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. కురువ గోవన్న 40 ఎకరాల భూమి ఉంది. కుటుంబ సభ్యులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.
ఇద్దరు కోడళ్ల మధ్య సత్సంబంధాలు ఉండగా గోవన్నకు తన చిన్న కోడలు అంటే నచ్చేది కాదు. కొన్ని రోజుల నుంచి గోవన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇతరుల సలహా మేరకు జొహరాపురంలో రెండు మూడు సార్లు డాక్టర్ (నాటు వైద్యుడు) వద్దకు వెళ్లాడు. సదరు వైద్యుడు పసరు మందు తాగించాడు. ఆ సమయంలో మందు పడినట్లు తెలిసింది. మందును మీ కొడళ్లే పెట్టించారని, చేతబడి చేశారని గోవన్నకు చెప్పాడు. అప్పటి నుంచి మామకు కోడళ్లపై అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని తన కుమారులకు చెప్పి వారి సహాయం తీసుకున్నాడు. ఇద్దరు కోడళ్లకు పిల్లలు లేకపోవడంతో హత్య చేసేందుకు ప్లాన్ చేశారు.
బుధవారం ఉదయం 11 గంటలకు తన కొడళ్లతో కలిసి మామ గోవన్న పొలం పనులకు వెళ్లాడు. వీరికి తోడుగా పెద్ద రామ గోవింద్ కూడా వెళ్లాడు. పనులు ముగిశాక కోడళ్లను పోరుగు పోలంలో గడ్డి కోసుకు రమ్మని పంపించాడు మామ గోవన్న. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం.. గోవన్న తన ఇద్దరు కొడుకులతో కలిసి అక్కడికి వెళ్లాడు. పెద్ద కొడలిపై వేపకర్రతో బాదాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుని కిందిపడిపోయింది. అడ్డుకోబోయిన చిన్న కోడలి ఛాతీపై తన్నాడు మామ. ఆమె కూడా కుప్పకూలిపోయింది. దీంతో ఇద్దరూ కోడళ్లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితులు మామ, అతడి ఇద్దరూ కొడుకులేనని తెలిసింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.