రైలు ఢీకొని వలస కూలీలు మృతి చెందిన విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్‌లోని చికిలి గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ (25), అకలేష్ శ్రీరామ్ వర్కడే (25) ఇద్దరూ పని కోసం జమ్మికుంటకు వలస వచ్చి మడిపల్లి రోడ్డులో ఉన్న సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్‌లో పనిచేస్తున్నారు. అయితే పని ముగించుకుని వెళ్తున్న సమయంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు.
రాత్రి వారు బ్రిక్స్ కంపెనీ నుండి ట్రాక్ వైపు వెళ్లగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మార్చురీలో భద్రపరిచారు. కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయగా వారు వచ్చి మృతులను గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. కాగా ఈ ఘటన ఆ వలస కూలీల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.