కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం అయ్యారు. గురువారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వెపుగా వెలుతున్న ఇసుక లారీ ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలోని జాతీయ రహదారిపై అదపుతప్పింది. డివైడర్‌ను దాటి రాజమహేంద్రవరం వైపు వెలుతున్న కంటైనర్ లారీని ఢీ కొట్టింది. వెంటనే మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అయితే.. ప్రమాదం ధాటికి లారీల క్యాబిన్లు రెండు నుజ్జునుజ్జుకావడంతో పాటు ఒకదానికొకటి ఇరుక్కుపోయాయి. ఎంతో శ్రమించి అందులో ఉన్న వారిని బయటకు తీశారు. అయితే అప్పటికే ముగ్గురు సజీవదహనం అయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడగా అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.