సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకు పాల్పడిన ఇద్దరు గ్యాంగ్‌స్టర్లను పంజాబ్ పోలీసులు బుధవారం అమృత్‌సర్‌లో ఎన్‌కౌంటర్‌లో హతమార్చారని ఒక అధికారి తెలిపారు. నాలుగు గంటలకు పైగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్లు జగ్‌రూప్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ మరణించారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ బాన్ తెలిపారు. వారి నుంచి ఏకే 47, పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అమృత్‌సర్ సమీపంలోని భక్నా గ్రామంలో గ్యాంగ్‌స్టర్లు, పోలీసుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ముఠా నాయకులను మట్టుబెట్టినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు.
మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలాగా ప్రసిద్ధి చెందిన శుభదీప్ సింగ్ సిద్ధూ కాల్చి చంపబడ్డాడు. మూసేవాలా హత్య కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రకారం.. జగ్‌రూప్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్‌లు మూసేవాలా కారును ఓవర్‌టేక్ చేసి కాల్పులు జరిపారు. ఈ కేసులో నిందితులు, అనుమానితులను పట్టుకునేందుకు గ్యాంగ్‌స్టర్ నిరోధక టాస్క్‌ఫోర్స్ కొంతకాలంగా ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగానే భక్నా గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తుండగా గ్యాంగ్‌స్టర్లు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులు జరిపి ఇద్దరిని హతమార్చారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి.