సహచరులపై కాల్పులకు తెగబడిన జవాన్.. ఇద్దరు మృతి
Two CRPF jawans on election duty killed in firing by colleague.గుజరాత్ రాష్ట్రంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 27 Nov 2022 2:46 AM GMTగుజరాత్ రాష్ట్రంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పోర్‌బందర్‌లో డిసెంబర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల విధుల నిర్వహణ కోసం వచ్చిన ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (IRB) కు చెందిన ఓ జవాన్ తన సహచర జవాన్లపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. నిందితుడిని ఎస్ ఇనౌచాసింగ్‌గా గుర్తించారు.
గుజరాత్ పోలీసుల కథనం ప్రకారం అతను IRB లో కానిస్టేబుల్. ఈ జవాన్లు మణిపూర్‌కు చెందిన సిఆర్‌పిఎఫ్ బెటాలియన్‌కు చెందినవారు. నిందితుడు తన రైఫిల్ ఏకే-47తో ఇతర పోలీసు సిబ్బందిపై కాల్పులు జరిపినట్లు గుజరాత్ పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం పోర్‌బందర్‌లోని నవీ బందర్‌లో IRB జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఎస్ ఇనౌచాసింగ్ సహచర జవాన్లపై కాల్పులు జరిపాడు. ఏ విషయం పై గొడవ పడ్డారు అనేది ఇంకా తెలియరాలేదు.
వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీరిని ఎన్నికల సంఘం ఇక్కడికి పంపిందని పోర్ బందర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎం శర్మ తెలిపారు. పోర్‌బందర్ జిల్లాలో మొదటి దశలో డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. "శనివారం సాయంత్రం ఏదో తెలియని సమస్యపై ఒక జవాన్ తన సహోద్యోగులపై రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని జామ్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించారు." అని శర్మ తెలిపారు.
తదుపరి విచారణ కొనసాగుతోందని గుజరాత్ పోలీసులు అధికారిక ప్రకటనలో తెలిపారు.