విషాదం.. ఆడుకుంటూ గ‌డ్డివాములో దాక్కున్న చిన్నారులు.. మంట‌లు అంటుకొని

Two Childrens died in mahabub nagar.మహబూబ్‌నగర్‌ జిల్లాలో గ‌డ్డివాముకు నిప్పంటుకోవ‌డంతో ఇద్ద‌రు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 April 2021 9:17 AM GMT
fire accident

మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గ‌డ్డివాముకు నిప్పంటుకోవ‌డంతో ఇద్ద‌రు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘ‌ట‌న న‌వాబుపేట మండ‌లం ఇప్ప‌టూరులో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. విజ్ఞేశ్‌, ప్రశాంత్‌ అనే ఇద్దరు చిన్నారులు శివ‌తో క‌లిసి ఇంటికి స‌మీపంలో దాగుడుమూత‌లు ఆడుకుంటూ ఉన్నారు. విజ్ఞేశ్‌, ప్రశాంత్ లు శివ‌కు క‌నిపించ‌కుండా ఉండేందుకు గ‌డ్డివాములో దాక్కున్నారు. ఈ స‌మ‌యంలో గ‌డ్డివాముకు మంట‌లు అంటుకున్నాయి. చిన్నారులు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించ‌గా ట్రాక్ట‌ర్ కేజ్‌వీల్స్ అడ్డుగా ఉండ‌డంతో వారు రాలేక‌పోయారు.

వారి కేక‌లు విన్న చుట్టుప్ర‌క్క‌ల వారు వెంట‌నే అక్క‌డ‌కు వ‌చ్చి కేజ్‌వీల్స్‌ను తొల‌గించి చిన్నారులను కాపాడే ప్ర‌య‌త్నం చేశారు. తీవ్ర‌గాయాలు కావ‌డంతో వెంట‌నే వారిని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ చిన్నారులు శుక్ర‌వారం ప్రాణాలు కోల్పోయారు. చిన్నారుల మృతితో ఆ కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో ముగ్గురు చిన్నారులు ఆడుకుంటుండగా.. ఓ బాలుడు అగ్నిపుల్ల వెలిగించడంతోనే మంటలు వ్యాపించాయని చికిత్స పొందుతున్న సమయంలో మృతులు చెప్పినట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story
Share it