సోనాలి ఫోగట్‌ మృతి కేసులో ట్విస్ట్‌.. పోలీసుల విచారణలో సంచలన నిజాలు

Twist in Sonali Phogat's death case.. Sensational truths in police investigation. బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్‌ అనుమానాస్పద మృతి కేసు మలుపులు తిరుగుతోంది. ఈ నెల 23న గోవాకు వెళ్లిన సోనాలి.. అక్కడే

By అంజి  Published on  26 Aug 2022 4:52 PM IST
సోనాలి ఫోగట్‌ మృతి కేసులో ట్విస్ట్‌.. పోలీసుల విచారణలో సంచలన నిజాలు

బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్‌ అనుమానాస్పద మృతి కేసు మలుపులు తిరుగుతోంది. ఈ నెల 23న గోవాకు వెళ్లిన సోనాలి.. అక్కడే హఠాన్మరణం చెందింది. అయితే మొదట ఆమె గుండెపోటుతో మరణించిందని పోలీసులు భావించారు. కాగా సోనాలి మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సోనాలి కుటుంబ సభ్యుల ఆరోపణలతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోనాలికి పార్టీలో డ్రగ్స్‌ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అదే ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు వెల్లడించారు.

గోవా ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీ) ఓంవీర్‌ సింగ్‌ బిష్ణోయ్‌ మాట్లాడుతూ.. ''సోనాలి ఫోగట్ మరణానికి ముందు అంజునాలో జరిగిన పార్టీలో ఆమెకు తన ఇద్దరు సహచరులు మత్తుమందు ఇచ్చారు. అసహ్యకరమైన రసాయన పదార్ధాలను కలిపిన డ్రింక్‌ను ఆమెతో బలవంతంగా తాగించారు.'' అని చెప్పారు. డ్రింక్‌ తాగిన తర్వాత సోనాలి తనకు తానుగా కంట్రోల్‌ తప్పిందని తెలిపారు. సోనాలి నియంత్రణ కోల్పోవడంతో ఉదయం 4.30 నిమిషాలకు తనను టాయిలెట్‌లకు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

అయితే తరువాత 2 గంటలపాటు ఏం చేశారనే దానిపై వివరణ లేదని పోలీసులు చెప్పారు. నిందితులిద్దరూ ఆమె హత్యకు సంబంధించిన కేసులో ఇప్పుడు ప్రధాన నిందితులుగా ఉన్నారని తెలిపారు. వీరిద్దరూ ఆగస్టు 22న సోనాలి ఫోగట్‌తో కలిసి గోవాకు వెళ్లారని, అంజునాలోని కర్లీస్ రెస్టారెంట్‌లో పార్టీ చేసుకున్నారని తెలిపారు. హర్యానా బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ మృతదేహంపై గాయాలు ఉన్నాయని పోస్ట్‌మార్టంలో వెల్లడి కావడంతో ఆమె హత్యలో ప్రమేయం ఉన్నందున గోవా పోలీసులు ఇద్దరు అనుచరులను గురువారం అరెస్టు చేశారు.

త్వరలోనే వారిని కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు వెల్లడించారు. ఇక డ్రగ్స్‌ ప్రభావంతోనే సోనాలి మృతి చెందినట్లు తెలుస్తుందన్నారు. సోనాలి ఫోగట్ శరీరంపై ఎటువంటి పదునైన గాయాలు లేవని గోవా పోలీసు అధికారులు వెల్లడించినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది. ఫోగట్ మృతి కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు సహచరులు సుధీర్ సగ్వాన్, సుఖ్వీందర్ వాసి. ఫోగట్ సోదరుడు రింకూ ధాకా బుధవారం అంజునా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిందితులిద్దరి పేర్లను పేర్కొన్నారు. ఆగస్ట్ 22న ఆమె గోవాకు వచ్చినప్పుడు సగ్వాన్, వాసీ ఫోగాట్‌తో కలిసి వచ్చారు.

ఆగస్టు 23 ఉదయం ఉత్తర గోవా జిల్లాలోని అంజునాలోని సెయింట్ ఆంథోనీ ఆసుపత్రికి సోనాలి ఫోగట్‌ను తీసుకువచ్చారు. ఆమె గుండెపోటుతో మరణించినట్లు ప్రాథమికంగా వైద్యులు తెలిపారు. గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జస్పాల్ సింగ్ మాట్లాడుతూ.. ఈ కేసులో ఎటువంటి గందరగోళం, అంతరాలు లేకుండా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Next Story