కేరళలో మంగళవారం నాడు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిశూర్ జిల్లా నాట్టిక గ్రామ జాతీయ రహదారి పక్కన నిద్రిస్తున్న వారిపై లారీ దూసుకుపోవడంతో ఐదుగురు మృతి చెందారు. ఓ ట్రక్కు రోడ్డు పక్కన ఉన్న టెంట్‌లోకి దూసుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు. మృతులు టెంట్‌లో నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. కన్నూరు నుంచి కలప లోడుతో వస్తోన్న లారీని ప్రమాద ఘటన తర్వాత డ్రైవర్ ఆపకుండా దూసుకుపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు ఆ లారీని పట్టుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో లారీని నడిపినట్టు పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
తెల్లవారుజామున 4.30 గంటలకు వలపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాట్టికలో జాతీయ రహదారిపై హైవే పక్కనే గుడారాల్లో నివసిస్తున్న బాధితులు, సంచార జాతులను ట్రక్కు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను త్రిస్సూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించామని , ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఏడాదిన్నర, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఇద్దరు మహిళలు కూడా చనిపోయారు. వాహనం డ్రైవర్, క్లీనర్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.