ఒకే యువకుడిని ప్రేమించిన ఇద్దరు యువతులు.. లాటరీ తీసిన పెద్దలు
Triangle Love Story in Hassan.ఓ యువకుడు ఇద్దరు యువతులను ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించాడు.
By తోట వంశీ కుమార్ Published on 6 Sept 2021 11:35 AM ISTఓ యువకుడు ఇద్దరు యువతులను ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించాడు. ఆ తరువాత విషయం అందరికి తెలిసింది. ఆ యువతులు ఇద్దరూ ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటామని భీష్మించుకూర్చున్నారు. ఊర్లో పెద్దమనుషులు పంచాయతీ పెట్టారు. అయినా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంలా పరిస్థితి మారిపోయింది. ఇలా మూడు నెలలు గడిచాయి. చివరికి లాటరీ తీసి ఇద్దరు యువతుల్లో ఒకరిని ఎంపిక చేసి పెళ్లి చేశారు గ్రామస్థులు. ఇదేదో సినిమా కథలా ఉంది అని అనుకుంటే మీరు పప్పులో కాలువేసినట్లే. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని హాసన జిల్లా సకలేశపుర ప్రాంతానికి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు యువతులతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమ కలాపాలు సాగించాడు. ఆ ఇద్దరు యువతులకు అతడంటే విపరీతమైన ప్రేమ ఉంది. అతడిని వివాహం చేసుకునేందుకు ఇద్దరూ అతడి స్వగ్రామానికి రావడంతో విషయం బట్టబయలైంది. విషయం పంచాయతీకి చేరింది. అక్కడ గ్రామ పెద్దలు ఇద్దరు యువతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా.. ఫలితం లేకుండా పోయింది.
ఇంతలో ఓ యువతి విషం తాగింది. సదరు యువతిని వెంటనే గ్రామస్తులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కోలుకున్న యువతి.. ఇటీవల తిరిగి వచ్చింది. దీంతో శుక్రవారం మరోసారి పంచాయతీ జరిగింది. ఇద్దరూ యువతులు ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో.. గ్రామ పెద్దలు చివరికి ఓ ఉపాయాన్ని కనిపెట్టారు. ఇద్దరు యువతుల పేర్లును చిట్టీలపై రాసి.. లాటరీ తీస్తే ఎవరు పేరు వస్తే.. ఆ యువతితోనే ఆ యువకుడి వివాహం చేస్తామని పెద్దలు చెప్పారు. పేరు రాని యువతి.. ఎలాంటి ఫిర్యాదు చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాలని షరతు విధించారు. ఇందుకు ఆ ముగ్గురు అంగీకరించగా.. ఇదే విషయాన్ని ఓ పేపర్‌పై వ్రాసి ముగ్గురు అందులో సంతకాలు చేశారు. అనంతరం లాటరీ తీయగా.. విషం తాగి ఆస్పత్రి పాలైన యువతి పేరు అందులో వచ్చింది.
దీంతో ఆయువతితో యువకుడికి వివాహం జరిపించారు. లాటరీలో పేరు రాని యువతి వారిద్దరికి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు.. ఆ యువకుడి చెంప చెళ్లుమనిపించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ముక్కోణపు ప్రేమ కథ గురించి తాజాగా గ్రామస్తులు వెల్లడించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.