హైదరాబాద్ శివార్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని ఇస్తాం చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులను హైదరాబాద్ ఇబ్రహీం బాగ్ ప్రాంతానికి చెందిన కార్తీక్ (25), గోవర్ధన్ (23), వెంకటేష్ (25)గా పోలీసులు గుర్తించారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గాలింపు చర్యలు చేపట్టి యువకుల మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. సరదాగా ఈతకు వెళ్లిన యువకులు ఇలా విగతజీవులుగా మారడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.