విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన రోడ్డు గుంత
రోడ్డుపై ఉన్న గుంతలు ఓ చిన్నారిని బలి తీసుకున్నాయి. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
By అంజి Published on 2 Aug 2023 11:41 AM ISTవిషాదం.. చిన్నారి ప్రాణం తీసిన రోడ్డు గుంత
రోడ్డుపై ఉన్న గుంతలు ఓ చిన్నారిని బలి తీసుకున్నాయి. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న రోడ్లన్నీ గుంతలు గుంతలుగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ గుంతల కారణంగా రోడ్డు ప్రమాదాలు సంభవించిన ఘటనలు కూడా ఎన్నో మరెన్నో. ఇటువంటి సంఘటనే తాజాగా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గుంతల కారణంగా ఓ చిన్నారి బలి అయిన సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది. జీడిమెట్ల బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న కిషోర్ తన కూతురు దీక్షిత (8) తో కలిసి స్కూటీపై స్కూలుకు వెళ్తున్న సమయంలో రెడ్డి ల్యాబ్ కంపెనీ వద్ద రోడ్డు దాటుతుండగా స్కూటీ గుంతలో పడిపోవడంతో తండ్రి వెనుక కూర్చున్న కూతురు దీక్షిత ఒక్కసారిగా ఎగిరి రోడ్డు మీద పడింది.
దీంతో స్కూటీ వెనకాల అత్యంత వేగంగా వస్తున్న భాష్యం స్కూల్ బస్సు ఒక్కసారిగా పాప మీద నుండి వెళ్ళిపోయింది . దీంతో తీవ్ర గాయాలైన పాప అక్కడికక్కడే మృతి చెందింది. పాపం మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే బాచుపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పాప బోరంపేటలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మూడోవ తరగతి చదువుతుందని, బస్సు డ్రైవర్ రహీం మితిమీరిన వేగంతో వాహనాన్ని నడుపుతూ, నిర్లక్ష్యంగా వ్యవహరించడమే పాపం మృతికి కారణంగా బాచుపల్లి సీఐ సుమన్ తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతామని తెలిపారు. పరారీలో ఉన్న బస్సు డ్రైవర్ రహీమ్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని సీఐ తెలిపారు.