విషాదం.. సీఐ బర్త్‌డే పార్టీలో హెడ్ కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. కూకట్‌పల్లి దేవినగర్‌లోని ఓ ఇంటి భవనం పైనుంచి పడి హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.

By అంజి  Published on  5 Aug 2024 4:00 PM IST
birthday party, Head constable died, Hyderabad, Kukatpally

విషాదం.. సీఐ బర్త్‌డే పార్టీలో హెడ్ కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్‌ నగరంలో విషాదం చోటు చేసుకుంది. బిల్డింగ్‌పై నుంచి కిందపడి హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కూకట్‌పల్లి పరిధిలోని దేవి నగర్‌లో నివాసం ఉంటున్న శేఖర్ అనే వ్యక్తి రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్‌లో సీఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతని పుట్టినరోజు సందర్భంగా స్నేహితులందరికీ పార్టీ ఇవ్వాలనుకున్నాడు. ఈ తరుణంలోనే నిన్న రాత్రి సమయంలో ఫ్రెండ్స్ అందరిని ఆహ్వానించాడు. సీఐ శేఖర్ ఇంటికి 30 మంది ఫ్రెండ్స్ వెళ్లారు. ఆ 30 మందిలో పదిమంది పోలీసులు ఉన్నారు. బర్త్‌ డే పార్టీ బిల్డింగ్‌ మూడవ అంతస్తులో జరిగింది.

అందరూ కలిసి పార్టీలో ఎంజాయ్ చేశారు. అనంతరం డిన్నర్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ మూడవ అంతస్తు నుండి హెడ్‌ కానిస్టేబుల్‌ డేవిడ్ ఒక్కసారిగా కింద పడిపోయాడు. దీంతో అతని తలకు బలమైన గాయం అయ్యింది. కింద పడిపోయిన డేవిడ్‌ను వెంటనే హాస్పిటల్ కి తరలించారు. కానీ అతను అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. డేవిడ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు 194 బి ఎన్.ఎస్.ఎస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు.

Next Story