ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టూరిస్ట్ బస్సు, ట్రక్కు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలు అయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. 16 మందితో టూరిస్ట్ బస్సు కర్ణాటక నుంచి అయోధ్యకు బయలుదేరింది. బహ్రైచ్-లఖింపూర్ హైవేపై మోతీపూర్ ప్రాంతంలోని నానిహా మార్కెట్ సమీపంలో బస్సును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో సహా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు.
దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. క్షతగాత్రుల్లో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ఈ ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ పరారు అయ్యాడు. ఈ ప్రమాదంపై కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.