నెత్తురోడిన రోడ్లు.. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి
Today Accidents In Telangana. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం ఉదయం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి.
By Medi Samrat Published on 11 Feb 2021 9:44 AM ISTరాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం ఉదయం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో ఆగిఉన్న డీసీఎం, కారును మరో డీసీఎం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా పామిడిపాడుకు చెందిన ఇన్నోవా కారు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్నది. ఈ క్రమంలో డ్రైవర్ కాలకృత్యాల కోసం కారును రోడ్డుకు పక్కన ఆపాడు. అదే సమయంలో ఇనుపలోడుతో వచ్చిన ఓ డీసీఎం కారు వెనుక ఆగింది.
అయితే.. అదే రోడ్డులో మిర్చీలోడ్‌తో మార్టూరు నుంచి పటాన్‌చెరు వెళ్తున్న మరో డీసీఎం ఆగి ఉన్న డీసీఎంను వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆ డీసీఎం ముందున్న ఇన్నోవాను బలంగా తాకింది. దీంతో కారు డ్రైవర్ అక్కడిక్కడే మృతిచెందాడు. మిర్చీ లోడుతోఉన్న వాహనంలోని ప్రకాశం జిల్లాకు చెందిన రైతు మృతిచెందాడు. డీసీఎం డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు.
ఇదిలావుంటే.. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ మండలం చిట్లపల్లి వద్ద లారీ, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుని దవాఖానకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
కాగా, నిజామాబాద్ జిల్లా బాల్కొండ వద్ద జాతీయ రహదారిపై మూడు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన మరో ఘటనలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయా ప్రమాదాలపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.