గుంటూరు జిల్లాలో మహా శివరాత్రి ఉత్సవాల నాడు విషాద సంఘటన చోటు చేసుకుంది. సరదాగా నడిచేందుకు వెళ్లిన ముగ్గురు నీట మునిగి మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఉన్నారు. ఈతగాళ్ల సాయంతో పోలీసులు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. వివరాల్లోకి వెళితే వినుకొండ పట్టణంలో డ్రైవర్ మున్నీరు ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడకు చెందిన బంధువులు ఆయేషా, నరసరావుపేటకు చెందిన ఫైజుల్లాఖాన్ వచ్చారు. కార్యక్రమం పూర్తైన అనంతరం మున్నీరు కుటుంబం సరదగా గడిపేందుకు నూజెండ్ల మండలం ఇనవోలు గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ వాగు వద్దకు వెళ్లారు.
అందరూ బ్రిడ్జిపై కూర్చుని ఉన్న సమయంలో మున్నీరు కుమార్తె హీనా (19)తోపాటు ఎస్‌కే ఫైజుల్లాఖాన్ (17), ఆయేషా (19) నదిలో సరదాగా నడుచుకుంటూ వెళుతుండగా ముగ్గురు పెద్ద గుంతలో పడి గల్లంతయ్యారు. ముగ్గురూ కాలువలో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.