విషాద యాత్ర.. రిజర్వాయర్‌లో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి
Three Students died after drowning in Akkampally Balancing Reservoir.సాగర్ అందాలను ఆస్వాదించేందుకు హైదరాబాద్ నుంచి
By తోట వంశీ కుమార్ Published on 14 Aug 2022 6:00 AM IST
సాగర్ అందాలను ఆస్వాదించేందుకు హైదరాబాద్ నుంచి వచ్చారు. అక్కడ గేట్ల ద్వారా కిందకు దూకుతున్న కృష్ణమ్మ పరవళ్లను చూస్తూ ఆనందంగా గడిపారు. తిరుగుప్రయాణంలో అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద స్నానం చేసేందుకు అని నీటిలో దిగారు. ముగ్గురు విద్యార్థులు నీట మునిగి చనిపోయారు. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలంలో చోటు చేసుకుంది.
నల్లగొండ జిల్లా పుట్టగండి గ్రామానికి చెందిన ప్రియాంక చిలుకూరు బాలాజీ కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది. ఆమె సోదరుడు కృష్ణ(18) నాంపల్లిలో ఇంటర్ చదువుతున్నాడు. తన సోదరి స్నేహితులైన కామారెడ్డి జిల్లా బిచ్కుకుందకు చెందిన దిండె ఆకాశ్ (20), సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన బంటు గణేశ్ (20), వరంగల్ జిల్లా పరకాలకు చెందిన కల్లపు లోహిత్, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన చందూ, ఖమ్మం జిల్లాకు చెందిన అవినాష్‌లతో కలిసి ఒకే రూమ్‌లో ఉంటున్నాడు.
శుక్రవారం రాఖీ పండుగ కావడంతో ప్రియాంక శుక్రవారం సోదరుడి వద్దకు వచ్చింది. అతడితో పాటు తన స్నేహితులకు రాఖీలు కట్టింది. సెలవులు ఉండడంతో నాగార్జున సాగర్‌కు వెళ్లాలని నిర్ణయించారు. అందరూ కలిసి ప్రియాంక సొంతూరైన పుట్టంగండికి వచ్చారు. కృష్ణ తండ్రి గజానన్‌తో కలిపి మొత్తం 9 మంది శనివారం ఉదయం సాగర్‌కు వెళ్లారు. కృష్ణమ్మ అందాలను వీక్షిస్తూ ఆనందంగా గడిపారు.
తిరుగు ప్రయాణంలో పీఏపల్లి మండలం అక్కంపల్లి జలాశయం మీదుగా పుట్టంగండికి పయనమయ్యారు. మార్గమధ్యంలో అక్కంపల్లి జలాశయం హెడ్ రెగ్యులేటర్ సమీపంలో ప్రియాంక, ఆమె తండ్రి మినహా మిగిలిన అందరూ జలాశయంలో స్నానానికి దిగారు. ఆకాశ్, గణేశ్, కృష్ణలు నీట మునిగి గల్లంతు అయ్యారు. మిగిలిన వారు కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని నీటిలోకి దూకి గణేశ్, పండిట్ కృష్ణను బయటకి తీయగా అప్పటికే మృతిచెందారు. ఆకాశ్ ఆచూకీ తెలియలేదు. గుడిపల్లి ఎస్‌ఐ వీరబాబు జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టగా ఆకాశ్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.