తొలిసారి గర్భం దాల్చింది ఆ మహిళ. దీంతో ఎంతో సంతోషించింది. తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంటోంది. బిడ్డను ఎత్తుకునే క్షణం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. అయితే.. గర్భవతి అయిన భార్యను ఎంతో అపురూపంగా చూసుకోవాల్సిన భర్త వేదించసాగాడు. అదనపు కట్నం కోసం గర్భిణి అని కనికరం లేకుండా చిత్ర హింసలు పెట్టేవాడు. ఈ క్రమంలో భార్యను వదిలించుకునేందుకు దారుణానికి పాల్పడ్డాడు. విషం, యాసిడ్ తాగించి హత మార్చాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మల్కాపూర్ కు చెందిన కల్యాణి(24)కి రాజ్‌పేట్ తండా వాసి తరుణత్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. కొద్ది రోజులు బాగానే ఉన్నా.. ఆ తరువాత వేదింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్తింటి వారు నిత్యం మానసికంగా, శారీరకంగా వేదింపులకు పాల్పడుతుండేవారు. భర్తతో పాటు మామ ఫకీరా, సమీప బంధువు ప్రవీణ్ బాధితురాలికి మంగళవారం బలవంతంగా విషం, యాసిడ్ తాగించారు.
కల్యాణి ప్రతిఘటించడంతో పాటు గట్టిగా కేకలు వేసింది. ఆమె కేకలు విని పక్కింటిలో ఉన్న ఆమె అక్క శోభ కంగారుగా వచ్చేసరికి కల్యాణి కిందపడిపోయి నోటిలోంచి నురుగులు కక్కుతూ కనిపించింది. వెంటనే ఆమె స్థానికుల సాయంతో నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.