ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బ‌స్సు.. ముగ్గురి మృతి

Three killed and several injured in Miryalaguda road accident.న‌ల్ల‌గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2021 4:57 AM GMT
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బ‌స్సు.. ముగ్గురి మృతి

న‌ల్ల‌గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెంద‌గా.. మ‌రో 15 మంది గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న మిర్యాలగూడ శివారులో నార్కట్ పల్లి- అద్దంకి హైవేలో రాత్రి 2 గంటల సమయంలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. ఒంగోలు నుంచి శ్రీకృష్ణ ట్రావెల్స్ బ‌స్సు 30 మంది ప్ర‌యాణీకుల‌తో హైద‌రాబాద్ వెలుతోంది. చింత‌ప‌ల్లి శివారులోకి రాగానే ఆగిఉన్న లారీనీ బ‌స్సు వెనుక నుంచి ఢీ కొట్టింది.

స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదం దాటికి బ‌స్సు ముందు బాగం నుజ్జునుజ్జు అయ్యింది. సీట్ల మధ్యలో ప్రయాణికులు ఇరుక్కుపోయారు. వారిని పోలీసులు అతి కష్టమ్మీద బయటకు తీసుకొచ్చారు. ప్ర‌మాద తీవ్ర‌త‌కు ఘ‌ట‌నా స్థ‌లంలోనే ఇద్ద‌రు మృతి చెంద‌గా.. మ‌రొక‌రు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందిని మిర్యాల‌గూడ ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. మృతులను ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన మల్లేశ్ (40)‌, కొత్త నాగేశ్వర్‌రావు (44), గుంటూరు జిల్లాకు చెందిన జయరావు(42)గా గుర్తించారు.

ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తులో లారీని ఢీకొట్టాడని సమాచారం. అంతకుముందు కూడా దాచేపల్లి దగ్గర ఓ ఆటోను ఢీకొట్టబోయి.. కొద్దిలో తప్పించాడని తెలిసింది. నిద్రమత్తుతో బస్సును నడపొద్దని ప్ర‌యాణీకులు చెప్పినా.. డ్రైవ‌ర్ వినిపించుకోలేదని తెలిసింది. డ్రైవర్‌కి కూడా గాయాలయ్యాయి. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it