విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం
Three arrested on charges of molested women in Vijayawada GGH.విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది.
By తోట వంశీ కుమార్ Published on 22 April 2022 3:43 AM GMTవిజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. మానసిక వికలాంగురాలైన ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ ఇరుకు గదిలో బంధించి 30 గంటల పాటు యువతి పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించారు.
వివరాల్లోకి వెళితే.. నగరంలోని వాంబే కాలనీకి చెందిన శ్రీకాంత్ (26) ప్రభుత్వాసుపత్రిలో పెస్ట్ కంట్రోల్ విభాగంలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన 23 ఏళ్ల మానసిక వికలాంగురాలైన ఓ యువతితో శ్రీకాంత్‌కు పరిచయం ఉంది. ఈ నెల 19న ఆ యువతి ఇంటి వద్ద ఒంటరిగా ఉండగా.. శ్రీకాంత్ ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. అనంతరం తనతో పాటు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు.
ఆస్పత్రిలో పెస్ట్ కంట్రోల్ విభాగానికి కేటాయించిన ఇరుకు గదిలో ఆమెను రాత్రంతా బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం ఆ యువతిని అక్కడే వదిలి వేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఎటు వెళ్లాలో తెలియక ఆ ప్రాంగణంలోనే తిరుగుతున్న యువతిపై ఒప్పంద కార్మికుడు చెన్న బాబురావు(23), అతని స్నేహితుడు పవన్ కళ్యాణ్(23) లు మరోసారి ఆ ఇరుకుగదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు.
మరోవైపు.. కుమార్తె కనిపించకపోవడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ శ్రీకాంత్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. శ్రీకాంత్‌ను పిలిచి విచారించగా.. బాధిత యువతిని తనతో పాటు ఆస్పత్రికి తీసుకువెళ్లి అక్కడే వదిలివేసినట్లు చెప్పాడు. నిందితుడు చెప్పిన సమాచారం ఆధారంగా బాధిత యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు 20వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు.
అక్కడ తమ కుమారై కోసం గాలిస్తుండగా.. పవన్ కళ్యాణ్ అనే యువకుడు యువతిపైన అత్యాచారానికి పాల్పడుతూ కనిపించాడు. కన్నబిడ్డపై తమ కళ్ల ముందే జరుగుతున్న ఆ ఘోరాన్ని చూసి తట్టుకోలేక బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అతడిని తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని విచారించగా.. తన కంటే ముందు చెన్న బాబురావు కూడా యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడించాడు. దీంతో ఈ అమానుష ఘటన మొత్తం బయటకు వచ్చింది.
కాగా.. పోలీసులు ఆది నుంచి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారై అదృశ్యమైందని ఫిర్యాదు ఇచ్చినా వెంటనే పట్టించుకోలేదన్నారు. ఓ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేసినా.. సత్వరం చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించారు. బాధిత యువతిని ఆస్పత్రి ప్రాంగణంలోనే వదిలేసి వచ్చేశానని ఓ నిందితుడు చెప్పినా సరే.. ఆమెను రక్షించేందుకు పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లలేదు. తామే(కుటుంబ సభ్యలే) వెళ్లి ఆమెను సంరక్షించుకున్నామన్నారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితుడు శ్రీకాంత్‌ను పట్టుకుని ఉంటే మిగతా ఇద్దరి బారిన బాధిత యువతి పడకుండా బయటపడేదని అంటున్నారు.
నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, బాధితురాలిని న్యాయం చేయాలని టీడీపీ నాయకులు, జనసేన కార్యకర్తలు, ఇతర సంఘాల నాయకులు నున్న పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇబ్రహీంపట్నం స్టేషన్‌కు తరలించారు.
నిందితుల అరెస్ట్..
యువతిపై అత్యాచారానికి పాల్పడిన వాంబేకాలనీకి చెందిన శ్రీకాంత్, సీతారాంపురం ప్రాంతానికి చెందిన చెన్నా బాబూరావు, వించిపేటకు చెందిన పవన్ కళ్యాణ్‌లను అరెస్ట్ చేసినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. విజయవాడ దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ వి.వి.నాయుడిని ఈ కేసులో దర్యాప్తు అధికారిగా నియమించినట్లు చెప్పారు. బాధితురాలికి పరిహారం అందేలా చూస్తామని అన్నారు