అర్ధరాత్రి వర్షంలో రెయిన్‌కోటుతో వచ్చి.. గుళ్లో చోరీ చేసిన దొంగ
దొంగ అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించి తన చేతివాటాన్ని చూపించాడు.
By Srikanth Gundamalla Published on 25 July 2023 12:28 PM ISTఅర్ధరాత్రి వర్షంలో రెయిన్‌కోటుతో వచ్చి.. గుళ్లో చోరీ చేసిన దొంగ
రోజు రోజుకి దొంగలు రెచ్చిపోతున్నారు. ఈజీగా మనీ సంపాదించేందుకు దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాళం వేసిన ఇళ్లు, ఒంటరిగా నడస్తోన్న మహిళలను టార్గెట్ చేసి బంగారు గొలుసులను లాక్కెళ్తున్నారు. కొందరు దొంగలైతే దేవుడు గుళ్లు అనే భక్తి లేకుండా ఆలయాల్లోనే చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ దొంగ దర్జాగా వెళ్లి హుండీ పగలగొట్టి చోరీకి పాల్పడ్డాడు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు దొంగ అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించి తన చేతివాటాన్ని చూపించాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వర్షం కురుస్తుండటంతో ఎవరూ బయట తిరగడం లేదు. ఇదే అదునుగా భావించిన ఓ వ్యక్తి దొంగతనం చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. భారీ వర్షం వస్తుండటంతో రెయిన్ కోటుని ధరించి ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ ఆలయంలోకి ప్రవేశించాడు. అటూ ఇటూ చూశాడు.. ఎవరూ లేరని నిర్ధారించుకుని హుండీ పగలగొట్టి డబ్బులు దోచుకువెళ్లాడు. అతను రెయిన్‌కోటు ధరించి ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అతను దర్జాగా ఆలయంలోకి వచ్చి.. చోరీకి పాల్పడిన దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ తర్వాత కూడా దొంగ దోచుకున్న నగదుని రెయిన్‌కోటు లోపల దాచుకుని తనకేం తెలియదు అన్నట్లుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
కాగా.. తర్వాత రోజు ఆలయానికి వచ్చిన పూజారి హుండీ పగిలి ఉండటాన్ని చూసి షాక్ తిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు హుండీని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని.. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. దొంగ దర్జాగా రెయిన్ కోటు వేసుకుని రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగానే దొంగను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా.. హుండీలో ఎంత వరకు నగదు అపహరణకు గురి అయ్యిందనే విషయం తెలియాల్సి ఉంది. రెయిన్ కోటు వేసుకోవడం వల్ల ముఖం కనిపించడం లేదని.. ఇతర సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.