Kazipet: వృద్ధురాలి హత్య.. యూట్యూబ్‌ చూసి ఆనవాళ్లు మాయం!

2 నెలల కిందట కాజీపేట రహమత్‌నగర్‌లో వృద్ధురాలు కన్నె విజయ (68) దారుణ హత్యకు గురైంది. తాజాగా హత్య ఘటనను పోలీసులు ఛేదించినట్లు తెలిసింది.

By అంజి  Published on  15 Feb 2024 7:00 AM IST
murder, Kazipet, Crime news

Kazipet: వృద్ధురాలి హత్య.. యూట్యూబ్‌ చూసి ఆనవాళ్లు మాయం!

2 నెలల కిందట కాజీపేట రహమత్‌నగర్‌లో వృద్ధురాలు కన్నె విజయ (68) దారుణ హత్యకు గురైంది. తాజాగా హత్య ఘటనను పోలీసులు ఛేదించినట్లు తెలిసింది. హత్య చేసిన నిందితులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. స్థానికంగా నివాముంటున్న వృద్ధురాలు కన్నె విజయను మర్డర్‌ చేసి, ఆధారాలు దొరకకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. నిందితులు యూట్యూబ్‌ చూసి ఆధారాలు దొరకుండా చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిందితుల ఇంట్లో గుర్తించిన రక్తపు మరకల ఆధారంగా పోలీసులు కేసు ఛేదించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గతేడాది డిసెంబరు 15న రహమత్‌నగర్‌కు చెందిన కన్నె విజయ హత్య చేయబడింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభ్యం దొరకలేదు, దీంతో దర్యాప్తు సవాల్‌గా మారింది. కాజీపేట ఇన్‌స్పెక్టర్‌ రాజు ఈ కేసుపై ప్రత్యేక దృష్టిపెట్టారు. బాధితురాలి కుటుంబ సభ్యులను, కాలనీవాసులను, వలస కూలీలను విచారించారు. సుమారు కాల్‌ డేటా ద్వారా 60 వేల ఫోన్‌ కాల్స్‌ను పరిశీలించినా ఒక్క క్లూ కూడా దొరకలేదు లభించలేదు. చివరికి హత్యకు గురైన వృద్ధురాలి ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఇంట్లో గుర్తించిన రక్తపు మరకల ఆధారంగా విచారణ చేసి, ఆమెనే హత్య చేసినట్లు గుర్తించారని తెలిసింది.

కన్నె విజయ కుటుంబ సభ్యురాలిపై సమీపంలో నివాసం ఉంటున్న మహిళ నిందలు వేయడంతో గొడవలు జరిగాయి. ఆమెతో పాటు మరో ఇద్దరితో విజయ ఘర్షణ పడ్డారు. మరుసటి రోజే విజయ హత్యకు గురైంది. నిందలు వేసిన మహిళ తన ఇంట్లోనే విజయను తీవ్రంగా కొట్టి చంపింది. యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఎలాంటి ఆధారాలు లభించకుండా మృతదేహాన్ని నీళ్లతో కడిగి హతురాలి ఇంటి ముందు పడేసింది. ఈ కేసు వివరాలను త్వరలోనే పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.

Next Story