విజయవాడలో కలకలం.. కూతురి వెంట పడొద్దన్నందుకు వ్యాపారిని చంపిన యువకుడు

విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కూతురితో ప్రేమ వ్యవహారం వద్దన మందలించిన వ్యక్తిని హత్య చేశాడో యువకుడు.

By అంజి  Published on  28 Jun 2024 1:23 PM IST
Vijayawada, Kirana Shop Owner, Murder,  Crime

విజయవాడలో కలకలం.. కూతురి వెంట పడొద్దన్నందుకు వ్యాపారిని చంపిన యువకుడు 

విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కూతురితో ప్రేమ వ్యవహారం వద్దన మందలించిన వ్యక్తిని హత్య చేశాడో యువకుడు. నగరంలోని కృష్ణలంక పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బృందావన్‌ కాలనీలో కంకిపాటి శ్రీరామ్‌ప్రసాద్‌ (56) వంశీ జనరల్‌ స్టోర్‌ నడుపుతున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుర్లు. విధ్యాధరపురం చెరువు సెంటర్‌లో వీరు నివాసం ఉంటున్నారు. పెద్ద కూతురు దర్శిని (22) విజయవాడలోని ఓ బీటెక్‌ కాలేజీలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. తన ఫ్రెండ్‌ హరిత ద్వారా ఆమెకు గడ్డం శివమణికంఠ అనే యువకుడితో 4 సంవత్సరాల కిందట పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని ఇద్దరూ నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని తమ ఇంట్లో వాళ్లకు చెప్పారు. వేర్వేరు కులాలు కావడంతో వారు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో శ్రీరామ్‌ప్రసాద్‌ కొందరు వ్యక్తులతో కలిసి.. తన కూతురి జోలికి రావొద్దని శివమణికంఠను మందలించాడు. ప్రియురాలికి దూరంగా ఉండాలని యువకుడి తల్లి కూడా అతడిని వారించింది. ఈ క్రమంలోనే శివమణికంఠ గురువారం రాత్రి 9 గంటల సమయంలో దుకాణం మూసివేసి ఇంటికి వెళ్తున్న తండ్రీకుమార్తెలు స్కూటర్‌ను ఎదురుగా వెళ్లి బైకుతో ఢీ కొట్టాడు. కిందపడిపోయిన శ్రీరామచంద్రప్రసాద్‌పై కత్తితో వేటు వేశాడు.

కిందపడిన ఆయనపై పలుమార్లు కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు శ్రీరామ్‌ప్రసాద్‌ను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీరామ్‌ప్రసాద్‌ మృతి చెందాడు. కృష్ణలంక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతుడి కూతురు పోలీసులను కోరింది. ఇష్టం లేదన్నా వేధించాడని వ్యాపారి కుమార్తె ఆవేదన వ్యక్తం చేసింది.

Next Story