భార్యను నడిరోడ్డుపై 15 సార్లు కత్తితో పొడిచి చంపిన భర్త.. ఆ తర్వాత తాను కూడా
The husband who stabbed his wife to death in Bangalore.. then stabbed himself too.. బెంగళూరు రూరల్ జిల్లా హోస్‌కోట్‌లోని పారిశ్రామిక ప్రాంతం సమీపంలో భర్త చేతిలో దారుణమైన కత్తి దాడికి గురైన
By అంజి Published on 17 Oct 2022 10:00 AM ISTబెంగళూరు రూరల్ జిల్లా హోస్‌కోట్‌లోని పారిశ్రామిక ప్రాంతం సమీపంలో భర్త చేతిలో దారుణమైన కత్తి దాడికి గురైన భార్య చికిత్స పొందుతూ మృతి చెందింది. హొస్కోటేలో నివాసముంటున్న నిందితుడు రమేష్ తన భార్య మెడపై, పొత్తికడుపుపై కత్తితో పొడిచి ఆపై తన మెడ, పొత్తికడుపుపై పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్ర గాయాలపాలైన అర్పిత చికిత్స విఫలమై ఆదివారం ఆస్పత్రిలో మృతి చెందింది. ఆత్మహత్యకు యత్నించిన నిందితుడు భర్త చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏడేళ్ల క్రితం రమేష్, అర్పిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 6 ఏళ్ల కొడుకు, 4 ఏళ్ల కూతురు ఉన్నారు. వీరిద్దరూ బెంగళూరు రూరల్ జిల్లా హోస్కోట్ పట్టణంలో నివాసం ఉంటున్నారు. అయితే గత ఏడాది కాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గొడవ కాస్తా విషాదంగా మారి హోస్కోటే పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. ఈలోగా ఇద్దరూ విడాకులు తీసుకోవడానికి అంగీకరించి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే వేరు వేరుగా ఉంటున్నారు. అయితే గత వారం రోజులుగా భార్య అర్పితపై అనుమానం ఉన్న భర్త రమేష్.. కలిసి జీవించాలని ఆమెతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.
ఆదివారం ఉదయం హొస్కోటే తాలూకాలోని సూలిబెలె పోలీస్‌స్టేషన్ పరిధిలోని పిల్లగుంపే పారిశ్రామికవాడకు భార్యను తీసుకొచ్చి కత్తితో 15 సార్లు పొడిచాడు. ఆ తర్వాత తనకు తానుగా పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. జనం రద్దీగా ఉండే ప్రదేశంలో భర్త కత్తితో భార్యను పొడిచి చంపిన ఘటన చూపరులను కలిచివేసింది. ఆ తర్వాత అతడు కత్తితో కడుపులో పొడుసుకున్నాడు. వెంటనే అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఇద్దరినీ హోస్కోట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అర్పిత తీవ్రంగా గాయపడి చికిత్స ఫలించక మృతి చెందింది. నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ ఘటనతో తల్లిదండ్రుల గొడవలు ఏమీ తెలియని చిన్నారులు మాత్రం అనాథలయ్యారు. సూలిబెలె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్పితపై అనుమానంతోనే భర్త ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెబుతున్నారు.