దారుణం.. భార్యాభర్తలను గొడ్డలితో నరికి చంపిన వంట మనిషి

The cook killed the husband and wife with an axe. భోజనం విషయం తలెత్తిన గొడవ భార్య, భర్తల ప్రాణాలను బలిగొన్నది. తాను పని చేస్తున్న ఇంటి యజమానులను

By అంజి  Published on  7 Sept 2022 5:28 PM IST
దారుణం.. భార్యాభర్తలను గొడ్డలితో నరికి చంపిన వంట మనిషి

భోజనం విషయం తలెత్తిన గొడవ భార్య, భర్తల ప్రాణాలను బలిగొన్నది. తాను పని చేస్తున్న ఇంటి యజమానులను వంటి మనిషి అతి కిరాతకంగా హత్య చేశాడు. వారి పిల్లలపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలుడు తప్పించుకున్నాడు. బాలికకు మాత్రం తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా మజ్‌గావ్ జామ్‌తోలి గ్రామంలో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు సత్యేంద్ర లక్రా కొన్నాళ్లుగా రిచర్డ్‌, మెలెనీ మింజ్‌ దంపతుల ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు.

కొద్ది రోజుల కిందట భోజనం విషయంలో రిచర్డ్‌కు, వంట మనిషికి గొడవ జరిగింది. ఆ టైమ్‌లో సత్యేంద్రను రిచర్డ్‌ హెచ్చరించడంతో.. ఆ కుటుంబంపై సత్యేంద్ర కోపం పెంచుకున్నాడు. ఆ కుటుంబం మొత్తాన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే పదునైన గొడ్డలితో రాత్రి సమయంలో నిద్రలో ఉన్న రిచర్డ్‌ దంపతులను హతమార్చాడు. ఆ తర్వాత దంపతుల కుమార్తెను తీవ్రంగా గాయపరిచాడు. అర్థరాత్రి జరిగిన దాడిలో కుమారుడు క్షేమంగా తప్పించుకుని, అప్రమత్తం చేయడంతో స్థానికులు నిందితుడిని పట్టుకున్నారు.

వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన బాలిక ప్రస్తుతం రాంచీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే, రిచర్డ్ తన కుటుంబాన్ని చంపుతానని బెదిరించాడని.. అందుకే అతడు దాడికి పాల్పడక ముందే వారిని అంతమొందించాలని నిర్ణయించుకున్నానని నిందితుడు పోలీసుల వద్ద చెప్పినట్లు సమాచారం. హత్య ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story