దారుణం.. నుపుర్ శ‌ర్మ‌కు మద్దతు తెలిపాడ‌ని.. ద‌ర్జీ త‌ల న‌రికివేత‌

Tension in Udaipur after man beheaded in broad daylight in busy market.రాజ‌స్థాన్ రాష్ట్రంలోని ఉద‌య్‌పూర్‌లో మంగ‌ళ‌వారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jun 2022 4:47 AM GMT
దారుణం.. నుపుర్ శ‌ర్మ‌కు మద్దతు తెలిపాడ‌ని.. ద‌ర్జీ త‌ల న‌రికివేత‌

రాజ‌స్థాన్ రాష్ట్రంలోని ఉద‌య్‌పూర్‌లో మంగ‌ళ‌వారం ఓ టైల‌ర్ ని దారుణంగా హ‌త‌మార్చారు. ఈ హ‌త్య దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. మహ్మద్‌ ప్రవక్తపై నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థించినందుకే అత‌డిని హ‌త్య చేసిన‌ట్లుగా నిందితులు వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ప్ర‌ధాని మోదీని చంపేస్తామంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఈ ఘ‌ట‌న‌తో రాజ‌స్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. కొన్ని చోట్ల హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి.

ఉదయ్‌పూర్‌కు చెందిన కన్హయ్య లాల్ ద‌ర్జీగా ప‌నిచేస్తుంటాడు. మహ్మద్‌ ప్రవక్తపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్ర‌తినిధి నూపుర్‌ శర్మకు మద్దతుగా అత‌డు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెట్టాడు. దీంతో అత‌డికి ప‌లు సంస్థ‌ల నుంచి బెదిరింపులు వ‌చ్చాయి. సోష‌ల్ మీడియాలో వ్యాఖ్య‌ల‌కు సంబంధించి ఇటీవ‌ల పోలీసులు క‌న్హ‌య్య‌ను అరెస్ట్ చేయ‌గా.. ఈ నెల 15న బెయిల్‌పై విడుద‌ల అయ్యాడు. ఎప్ప‌టిలాగానే ధ‌న్‌మండీ ప్రాంతంలో మంగ‌ళ‌వారం త‌న షాపులో ప‌నిచేసుకుంటూ ఉన్నాడు.

బ‌యటి నుంచి కస్టమర్ల రూపంలో రియాజ్ అఖ్తారీ, గౌస్ మ‌హ్మ‌ద్ అనే ఇద్దరు వ్యక్తులు షాపులోకి వచ్చారు. కొలతలు తీసుకుంటుండగా రియాజ్‌ కత్తి తీసి కన్హయ్య మెడపై వేట్లు వేశాడు. క‌న్హ‌య్య కింద‌ప‌డి విల‌విల‌లాడుతుండ‌గా ఆయ‌న మొండెం నుంచి త‌ల‌ను వేరు చేసేందుకు క‌త్తితో కిరాతంగా కోశాడు. దీన్నంతా గౌస్‌ తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీశాడు. అనంత‌రం ఇద్దరూ అక్క‌డి నుంచి పారిపోయారు.

కొద్ది సేప‌టి త‌రువాత హ‌త్య వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైర‌ల్‌గా మారుతుండ‌గా మ‌రో వీడియోను పోస్ట్ చేశారు. నూపుర్‌ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామంటూ హంతకులు ఆ వీడియోలో తెలిపారు. పైగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలాగే చంపుతామని హెచ్చరించారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు రియాజ్‌, గౌస్‌లు బైక్‌పై పారిపోతుండ‌గా రాజ్‌స‌మంద్ జిల్లా భీమ్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. రియాజ్ ఓ మ‌సీదులో పని చేస్తుండ‌గా, గౌస్ కిర‌ణా దుకాణాన్ని న‌డుపుతుండ‌ని పోలీసులు తెలిపారు. మరోవైపు సీఎం అశోక్‌గెహ్లాట్‌ సహా పోలీస్‌ శాఖ నిందితుల వీడియోలను వైరల్‌ చేయొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. తద్వారా శాంతిభద్రతలను పరిరక్షించాలంటూ కోరుతున్నారు.

ఈ హ‌త్య‌తో ఉద‌య్‌పూర్‌లో ప‌రిస్థితులు ఒక్క‌సారిగా ఉద్రిక్తంగా మారాయి. పలు ప్రాంతాల్లో ఆస్తుల ధ్వంసం, వాహనాలకు నిప్పంటించడం లాంటి ఘటనలు జరిగాయి. ఉద్రిక్తతలు పెరగడంతో నగరంలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌ సేవలు నిలిపేశారు. బుధవారం మొత్తం ఇంటర్నెట్‌ పని చేయదని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నెలపాటు 144 సెక్షన్‌ విధించారు.

రక్షణ కోరినా పట్టించుకోలేదు..

మృతుడు పోలీసు రక్షణ కోరినా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ సతీశ్‌ పునియా ఆరోపించారు. 'క‌న్హ‌య్య హ‌త్య‌ను విశ్వ హిందూ ప‌రిష‌త్ ఖండించింది. మరోవైపు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ మొదలుకుని పలువురు నేతలు హత్యను ఖండించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Next Story