దారుణం.. తెలుగు నటిపై ఫిట్‌నెస్ ట్రైనర్ అత్యాచారం
Telugu Actress harassed by Fitness Trainer.ఓ నటిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ ఫిట్‌నెస్ ట్రైనర్ అత్యాచారానికి
By తోట వంశీ కుమార్ Published on 14 Sept 2022 9:10 AM ISTఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ప్రేమిస్తున్నానని వెంటపడుతూ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గర అవుతున్నారు. పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేస్తున్నారు. గట్టిగా నిలదీస్తే సన్నిహితంగా ఉన్న ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ తెలుగు నటిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించిన ఓ ఫిట్‌నెస్ ట్రైనర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ముంబై నగరంలో కూఫీ పరేడ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదిత్యకపూర్ అనే వ్యక్తి ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించిన ఓ నటికి ఆదిత్య కపూర్ పరిచయం అయ్యాడు. నటి పట్ల తొలుత ఆదిత్య మంచిగానే ప్రవర్తించినా.. ఆ తరువాత తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు నటిపై అత్యాచారం చేశాడు.
తనను వివాహం చేసుకోవాలని అడిగితే ఆదిత్య కపూర్ తనను దూషించి కొట్టాడని తెలుగునటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తాము ఇద్దరం సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలను బయటపెడతానంటూ బెదిరిస్తున్నాడని పేర్కొంది. నటి ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు ఫిట్‌నెస్ ట్రైనర్ ఆదిత్యకపూర్ పై ఐపీసీ సెక్షన్ 376, 323,504,506(2), 67,67ఎ, ఐటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. అత్యాచార బాధితురాలైన తెలుగు నటి 2016 నుంచి తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్నారు.