మహబూబాబాద్ జిల్లా పరిధిలోని కొమ్ముగూడెం తండాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. భర్త చంపేశాడు. ఈ పాపంలో బాధితురాలి అత్త, మామ, మరిది కూడా పాలు పంచుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొమ్ముగూడెం తండాకు చెందిన బానోతు స్వప్న (30), అదే తండాకు చెందిన రామన్న 15 ఏళ్ల కిందట ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు.
వివాహం సమయంలో స్వప్న తల్లిదండ్రులు రూ.3 లక్షలు కట్నం ఇచ్చారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. కొంత కాలం తర్వాత భర్త అదనపు కట్నం కావాలని వేధించడం మొదలు పెట్టాడు. దీంతో స్వప్న తల్లిదండ్రులు ఎకరం భూమిని ఇచ్చారు. ఆ తర్వాత గొడవలు సద్దుమణిగాయి. మళ్లీ కొన్ని రోజుల నుండి అదనపు కట్నం కోసం రామన్న తన భార్యను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు.
అలాగే ఇంటి విషయాలను బయటి వారికి చెప్పొద్దంటూ వేధించి ఆమెను రేకుల గదిలో ఉంచాడు. ఈ క్రమంలోనే శనివారం నాడు రాత్రి నలుగురు కలిసి స్వప్నను తీవ్రంగా కొట్టి చంపేశారు. అనుమానం రాకుండా ఉండేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు నటించి డెడ్‌బాడీని ఇంటికి తీసుకొచ్చారు. పురుగుల మందు నోట్ల పోసి సూసైడ్‌గా చిత్రీకరించేందుకు యత్నించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.