విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఆ ఉపాధ్యాయుడు విలువలు మరిచి పాడు పని చేశాడు. అభం, శుభం తెలియని విద్యార్థునులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేరళ రాష్ట్రంలోని కన్నూర్‌లోని ఎయిడెడ్ లోయర్ ప్రైమరీ స్కూల్‌లో గణిత ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న పీఈ గోవిందన్ నంబూద్రి (50) నలుగురు మైనర్ బాలికలపై తరగతి గదిలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 4, 5వ తరగతులకు చెందిన నలుగురు విద్యార్థినులపై తరచుగా లైంగిక దాడులు చేసినట్లు పోలీసులు అభియోగాలు మోపారు.
తరగతి గదిలోని సమస్యలను పరిష్కరించడం పేరుతో వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు అభియోగాలు మోపారు. పోలీసులు నిందితుడిపై పోక్సో సెక్షన్ 9 (ఎఫ్) (ఒక విద్యా సంస్థ నిర్వహణలో లేదా సిబ్బందిలో ఉన్నవారు ఆ సంస్థలోని పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే), సెక్షన్ 9 (ఎమ్) (12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడటం), సెక్షన్ 9 (ఎల్) కింద మూడు కేసులలో (లైంగిక వేధింపులకు పాల్పడ్డారు) కింద కేసు నమోదు చేశారు.
2013 జూన్ నుంచి 2014 ఫిబ్రవరి మధ్య అతడు చేసిన దారుణాలు బయటకు వచ్చాయి. అతడిపై మోపబడిన అభియోగాలు నిర్దారణ కావడంతో తాలిపరంబ ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు 79 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. పయ్యన్నూరులోని అలప్పడంబు సమీపంలోని చూరల్‌కు చెందిన నిందితుడు పిఇ గోవిందన్ నంబూద్రి (50)కి న్యాయమూర్తి సి ముజీబ్ రెహమాన్ 2.7 లక్షల రూపాయల జరిమానా విధించారు.