దారుణం.. తల్లిని దారుణంగా కొట్టి, సజీవంగా పూడ్చిన కొడుకు

Tamilnadu Son who beat his mother to death in drunkenness and buried her alive. తల్లి చనిపోయిందని భావించిన కొడుకు.. ఆమెను సజీవంగా పూడ్చిపెట్టిన ఘటన తమిళనాడు విల్లుపురంలోని

By అంజి  Published on  10 Nov 2022 1:16 AM GMT
దారుణం.. తల్లిని దారుణంగా కొట్టి, సజీవంగా పూడ్చిన కొడుకు

తల్లి చనిపోయిందని భావించిన కొడుకు.. ఆమెను సజీవంగా పూడ్చిపెట్టిన ఘటన తమిళనాడు విల్లుపురంలోని కందాచీపురం సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల ఇలా ఉన్నాయి. శక్తివేల్ విల్లుపురం జిల్లా కందాచీపురం సమీపంలోని వి.చిట్టమూరు గ్రామానికి చెందినవాడు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే పని చేస్తుండేవాడు. అతనికి వివాహమై నలుగురు పిల్లలు ఉన్నారు. గొడవల కారణంగా తన భార్య పిల్లలతో సహా పుట్టింట్లో ఉంటోంది. శక్తివేల్‌ తన తల్లి యశోదతో కలిసి ఉంటున్నాడు. తండ్రి 15 ఏళ్ల క్రితమే చనిపోయాడు. శక్తివేల్‌కు మద్యం తాగే అలవాటు ఉంది. అలా తాగొచ్చి నిత్యం తల్లితో గొడవ పడేవాడు.

ఈ క్రమంలో మొన్న రాత్రి తాగి ఇంటికి వెళ్లిన శక్తివేల్ కుటుంబ కార్డు కావాలని తల్లిని అడిగాడు. అయితే కార్డు ఇచ్చేందుకు తల్లి యశోద(75) నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన శక్తివేల్ నిన్న తెల్లవారుజామున మద్యం మత్తులో తన తల్లి ఇంటికి వెళ్లి మరోసారి వాగ్వాదానికి దిగాడు. ఈ వివాదంతో కోపోద్రిక్తుడైన శక్తివేల్ తల్లి యశదోపై దాడి చేయడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. మద్యం మత్తులో తల్లి చనిపోయిందని భావించిన శక్తివేల్ ఇంటి వెనుక బోరు వేసి తల్లిని సజీవంగా పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత యశోద కనిపించకపోయేసరికి ఇరుగు పొరుగు వారు గాలింపు చేపట్టారు.

శక్తివేల్‌ ఇంటికి తాళం వేసి ఉండటంతో ఇంటికి వెనుకవైపు వెళ్లి చూడగా యశోద చీర కిందపడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లారు. అక్కడే ఉన్న శక్తి వేల్‌కు స్థానికులు దేహాశుద్ధి చేశారు. తన తల్లిని కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయిందని, దీంతో ఇంటి వెనుక గొయ్యి తీసి పాతిపెట్టానని వెల్లడించాడు. దీనిపై సమాచారం అందుకున్న అరగందనల్లూరు పోలీసులు మద్యం మత్తులో ఉన్న శక్తి వేల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యశోద మృతదేహాన్ని వెలికి తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మద్యం మత్తులో తల్లిని కొట్టి సజీవ సమాధి చేసిన కొడుకు చర్య ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Next Story