తమిళనాడులో ఘోర ప్రమాదం, చిన్నారి సహా ఐదుగురు దుర్మరణం
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 12 Sept 2024 12:15 PM ISTతమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిదంబరం వద్ద కారును ఎదురుగా వెళ్లి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. అయితే.. ఈ సంఘటనలో ఒక చిన్నారి సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలాడుతురైకి చెందిన 56 ఏళ్ల మహ్మద్ అన్వర్ తన కుటుంబంతో కలిసి చెన్నైలోని తమ బంధువులను కలిసేందుకు కారులో బయల్దేరి వెళ్లారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను కలిసి.. మాట్లాడారు. అదే కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే పి.ముట్లూరు వంతెనపైకి కారు రాగా.. ఎదురుగా వచ్చిన లారీ అదుపుతప్పి వేగంగా ఢీకొట్టింది. దాంతో.. ఈ సంఘటనలో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఒక చిన్నారితో సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం గురించి స్థానికులు, ఇతర వాహనదారుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు.
అయితే.. చనిపోయిన వారిని మహ్మద్ అన్వర్, యాసర్ అరాఫత్ తో పాటు ఇద్దరు మహిళలు హజీరా బేగం, హరాఫత్నీషా, మూడేల్ల బాలుడు అమ్నాన్‌గా గుర్తించారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయారని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేశామనీ.. లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో ఒకేసారి ఐదుగురు చనిపోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.