అనంతపురంలో స్టాఫ్‌ నర్సు అనుమానాస్పద మృతి

Suspicious death of staff nurse in Anantapur. అనంతపురంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

By అంజి  Published on  25 Jan 2023 9:32 AM GMT
అనంతపురంలో స్టాఫ్‌ నర్సు అనుమానాస్పద మృతి

అనంతపురంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారులోని టమాటా మండి బీజేపీ షెడ్లలో నివాసముంటున్న సునీత, కేశప్ప దంపతుల కుమార్తె పద్మ(23) కిమ్స్ సవీరా ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. సోమవారం రాత్రి డ్యూటీకి హాజరైన ఆమె మంగళవారం తెల్లవారుజామున 2.22 గంటలకు ఎమర్జెన్సీ గదిలోని బెడ్‌పై నిద్రపోయింది.

తెల్లవారుజామున 4.45 గంటలకు ఆమెను నిద్ర లేపేందుకు తోటి ఉద్యోగి వెళ్లాడు. ఆ సమయంలో పద్మ అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించి వెంటనే ఆసుపత్రి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమైన వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని కూతురి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.

తమ బిడ్డ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అనంతపురం 4వ పట్టణ పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు సాకే హరి తదితరులు ఆస్పత్రికి చేరుకుని పద్మ మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె మృతికి గల కారణాలు చెప్పాలని ఆసుపత్రి అధికారులను డిమాండ్ చేశారు.

రెండు రోజుల క్రితం చిన్నారికి వైద్యం అందించే విషయంలో యాజమాన్యం పద్మను భయభ్రాంతులకు గురిచేశారని, తప్పు లేకపోయినప్పటికీ లిఖితపూర్వకంగా అంగీకారం తెలిపేలా చేశారని పద్మ తల్లిదండ్రులు వాపోయారు. మరుసటి రోజు కూడా ఆమెను డైరెక్టర్ల సమావేశానికి తీసుకొచ్చి రాత్రి 9 గంటల వరకు నిలబెట్టి దూషించారు. పద్మ మృతిపై లోతైన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story
Share it