బెంగుళూరులో ఒక అనుమానిత ఉగ్రవాది పట్టుబడ్డాడు. అస్సామీ యువకుడు అల్ ఖైదాలో చేరాలని ప్లాన్ చేసుకున్నాడని, దేశానికి వ్యతిరేకంగా పని చేయాలని అనుకున్నాడని దర్యాప్తులో తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి. అస్సాంకు చెందిన అక్తర్ హుస్సేన్ అనే అనుమానిత ఉగ్రవాది గురించి పక్కా సమాచారంతో, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) స్పెషల్ వింగ్, అంతర్గత భద్రతా విభాగం (ISD), ఇంటెలిజెన్స్ వింగ్ సహకారంతో నగరంలోని తిలక్‌నగర్‌లో ఆదివారం రాత్రి ఒక నివాసంపై దాడి చేశారు. హుస్సేన్‌తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) తీవ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నట్లు మొదట ఆరోపణలు వచ్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హుస్సేన్ ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద సంస్థలతో ఆన్‌లైన్‌లో మాట్లాడాడు. హుస్సేన్ అల్ ఖైదా తీవ్రవాదులను కలవడానికి కశ్మీర్‌కు వెళ్లాలని అనుకున్నాడు. హుస్సేన్ రాత్రి పొద్దుపోయే వరకు ఫుడ్ డెలివరీ వ్యక్తిగా పనిచేశాడు. ఎప్పుడూ మౌనంగా ఉండేవాడని గుర్తించారు. ఈ విషయంపై బెంగళూరు పోలీసు శాఖ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ఐదుగురిని ప్రశ్నిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.