శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఎచ్చెర్లలో బుధవారం ఓ వ్యక్తి తన సొంత కుటుంబ సభ్యులపై దాడి చేసి కొడుకును హత్య చేశాడు . స్థానికుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందిన కొండ్రు కుప్పయ్య, అతని భార్య హరెమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు తాతారావు (26), కామరాజు, ఒక కుమార్తె లక్ష్మి ఉన్నారు. దంపతుల మధ్య గత రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. గొడవ జరిగిన ప్రతిసారి కొడుకులు, కూతురు తల్లి హరెమ్మకు మద్దతు ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం కూడా కుప్పయ్యకు, హరెమ్మకు మధ్య గొడవ జరిగింది.
దీంతో కోపోద్రిక్తుడైన కుప్పయ్య తన కుటుంబ సభ్యులందరినీ చంపేయాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గాఢనిద్రలో ఉన్న వారిపై కొడవలితో దాడి చేశాడు. తాతారావు అక్కడికక్కడే మృతి చెందాడు. కామ రాజు తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు కామరాజును శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. కామరాజు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కుప్పయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.