కరోనా వైరస్ వ్యాప్తి మొదలై రెండేళ్లు దాటినా.. ఈ మహమ్మారి వదలడం లేదు. వేవ్‌ల రూపంలో ప్రాణాలు బలిగొంటూనే ఉంది. సామాన్యులు, సెలబ్రెటీలు అన్న తేడా లేకుండా ఎంతో మంది ఈ వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. దీంతో ఎన్నో కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయి.. చిన్నాభిన్నం అవుతున్నాయి. ఇక తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. మానసిక వేదనకు గురైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. భద్రాచలం జిల్లాకు చెందిన అలేఖ్య అనే 28 ఏళ్ల యువతి హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. అల్వాల్ కానాజీగూడలోని మానస సరోవర్ హైట్స్‌లో నివాసం ఉంటోంది. ఈ నెల 21 అలేఖ్య అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో వైద్య పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఆమె ప్లాట్‌లోనే ఐసోలేషన్‌లో ఉంటోంది. కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడేది.
అయితే.. ఈ నెల 23న తేదీ సాయంత్రం తల్లిదండ్రులు ఎన్ని సార్లు ఫోన్ చేసినప్పటికి స్పందించలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు ఆమె నివాసానికి వచ్చి చూడగా.. ఉరికి వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.