విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాత కక్షల నేఫథ్యంలో ఓ వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా హతమార్చాడు. చిన్నారులను సైతం అతడు వదలలేదు. వివరాళ్లోకెళితే.. పెందుర్తి మండలం జుత్తాడలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ తీవ్ర విషాదానికి దారి తీసింది. బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి.. అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రమణ కుటుంబంపై దాడికి దిగాడు. కుటుంబంలోని ఆరుగురిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. మృతుల్లో నలుగురు పెద్దలు, మూడేళ్ల పాప, ఐదు నెలల పసికందు ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మృతిచెందిన వారిని రమణ(63), రమాదేవి(53), ఉషారాణి(35), అరుణ(37), ఉదయ్ (2), ఉర్విష(6 నెలలు) లు గుర్తించారు. మృతదేహాలను పరిశీలించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో జుత్తాడలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆరుగురిని దారుణంగా హత మార్చిన తరువాత నిందితుడు అప్పలరాజు నేరుగా పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు లొంగిపోయిన విషయాన్ని పోలీసులు దృవీకరించలేదు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురికావడంతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.