దేశంలో రోజు రోజుకు మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో దారుణ ఘటన వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలికపై ఆరు నెలల పాటు ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార సమయంలో వీడియోలు రికార్డ్ చేశారు. ఆ తర్వాత అసభ్య చిత్రాలు, వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని నిందితుడు మైనర్ బాలికను బెదిరించారు. గత ఆరు నెలల నుంచి లైంగిక వేధింపులకు గురైన బాధితురాలు తన తల్లికి తన బాధను వివరించింది. దీంతో ఆమె మంగళవారం చతుర్శృంగి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, ప్రత్యేక కోర్టు వారికి జనవరి 5, 2023 వరకు కస్టోడియల్ రిమాండ్ విధించింది. మైనర్ బాలికకు నిందితులందరూ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నందున వారికి తెలుసునని ప్రాథమిక విచారణలో తేలిందని జోన్ 4 డీసీపీ శశికాంత్ బోరాటే తెలిపారు. ''ఈ ఏడాది జూలైలో లైంగిక వేధింపులు మొదలయ్యాయి. ప్రధాన నిందితుడు ఆమెను సాంగ్వి ప్రాంతంలోని లాడ్జికి బలవంతంగా తీసుకెళ్లి, అత్యాచారం చేసి, అశ్లీల చిత్రాలను కూడా క్లిక్ చేశాడు. పదేపదే లైంగికంగా వేధించి మరో ఐదుగురితో అతను విజువల్స్ పంచుకున్నాడు'' అని బోరటే చెప్పారు.
ఆరుగురు కలిసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. మొత్తం ఆరుగురు నిందితులు 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్కులే. వారిలో ఇద్దరు ఫుడ్ డెలివరీ యాప్‌లో పనిచేస్తున్నారని, ఒకరు స్టాల్‌ను కలిగి ఉన్నారని, 3 మంది నిరుద్యోగులుగా ఉన్నారని ఆయన తెలిపారు.