విషాదం.. ఆరుగురు చిన్నారులు చెరువులో మునిగి మృతి

Six children drowned in a pond in Haryana. హర్యానా రాష్ట్రంలో విషాద ఘటన జరిగింది. గురుగ్రామ్‌లోని శంకర్‌విహార్‌లో చెరువులో మునిగి ఆరుగురు చిన్నారులు

By అంజి  Published on  10 Oct 2022 6:59 AM IST
విషాదం.. ఆరుగురు చిన్నారులు చెరువులో మునిగి మృతి

హర్యానా రాష్ట్రంలో విషాద ఘటన జరిగింది. గురుగ్రామ్‌లోని శంకర్‌విహార్‌లో చెరువులో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. ''ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని చెరువు నిండింది. ఈ క్రమంలోనే చెరువులో స్నానానికి వెళ్లిన ఆరుగురు చిన్నారులు మునిగిపోయారు'' అని పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారందరూ 8 నుంచి 13 ఏళ్ల వయస్సు వారే. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌ సిబ్బంది 4 గంటలు శ్రమించి ఆరుగురు మృతదేహాలను బయటకు తీశారు.

మృతులను శంకర్‌విహార్‌ కాలనీకి చెందిన దుర్గేశ్‌, అజిత్, రాహుల్‌, పీయూశ్‌, దేవా, వరుణ్‌లుగా గుర్తించారు. మృతదేహాలను వెలికితీసిన తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారని గురుగ్రామ్ డిప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇదిలా ఉంటే.. హర్యానాలోని ధనౌరీలోని సాబిర్‌ పాక్‌ దర్గాను సందర్శించడానికి వచ్చిన ముగ్గురు యాత్రికులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మరణించారు. కుంటలో స్నానం చేయడానికి వెళ్లి మునిగిపోయినట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. మృతులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా స్థానికులు చెబుతున్నారు.

Next Story