వరంగల్ నగరంలోని ఎల్బీనగర్‌లో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. గురువారం ప్రధాన నిందితుడు షఫీతో పాటు సహకరించిన మరో ఐదుగురు నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. సీపీ తరుణ్ జోషి వివరాలు వెల్లడించారు. ముగ్గురి హత్య కేసులో ఆరుగురు నిందితులు మహమ్మద్ షఫీ, బోయిని వెంకన్న, ఎండీ సాజిద్, రాగులు విజేందర్, ఎండీ మీర్జా అక్బర్, ఎండీ పాషా అరెస్టు చేసినట్లు తెలిపారు. వ్యాపార లావాదేవీల్లో గొడవల కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు చెప్పారు. నిందితుల నుంచి వేట కత్తులు, కోత మిషన్, రెండు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని సీపీ వివరించారు.
పశువుల వ్యాపారంలో తలెత్తిన ఆర్థిక లావాదేవీలతోనే అన్న చాంద్‌పాషా కుటుంబం పై తమ్ముడు షపీ కత్తులు, కట్టెలు కట్ చేసే కట్టర్ లను తీసుకుని మరికొందరి సాయంతో దాడికి పాల్పడ్డాడు. ఇంట్లోకి వెళ్లిన అనంతరం అన్న చాంద్‌పాషా, వదిన సబీరా బేగం, బావ మరిది ఖలీల్ దాడి చేశారు. అలికిడి అక్కడకు వచ్చన చాంద్ పాషా కుమారులు ఫహద్ పాషా, సమీర్ పాషాలపై కూడా దాడి చేశారన్నారు. ఘటనా స్థలంలో చాంద్‌పాషా, సబీరా బేగం, ఖలీల్ మృతి చెందారన్నారు. తీవ్రంగా గాయపడిని ఫహద్ పాషా, సమీర్ పాషాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు సీపీ తెలిపారు.