గాంధీ ఆస్పత్రిలో దారుణం.. అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం

Sisters kidnap and Gang molested in Gandhi Hosptial.హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఉన్న గాంధీ ఆస్ప‌త్రిలో దారుణం చోటు చేసుకుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Aug 2021 9:11 AM IST
గాంధీ ఆస్పత్రిలో దారుణం.. అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం

హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఉన్న గాంధీ ఆస్ప‌త్రిలో దారుణం చోటు చేసుకుంది. రోగికి సాయంగా వచ్చిన అక్కా చెల్లెళ్లపై ఆస్ప‌త్రిలో ప‌నిచేస్తున్న సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన బావకు చికిత్స చేయించేందుకు గాంధీ ఆస్పత్రికి వస్తే అక్కడ తమకు మత్తు మందు ఇచ్చి ఓ గ‌దిలో బంధించి వారం రోజులు ఐదారుగురు సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది. ఆస్పత్రి వెనుక అపస్మారక స్థితిలో వున్న ఆమెను కుటుంబ సభ్యులు గుర్తించడంతో ఈ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. తన అక్క ఆచూకీ కూడా గల్లంతయిందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

వివ‌రాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌కు చెందిన ఒక వ్యక్తి రెండు కిడ్నీలూ పాడైపోవడంతో ఈ నెల 5న గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఆయ‌న‌కు స‌హాయ‌కులుగా భార్య‌, మ‌ర‌ద‌లు వ‌చ్చారు. కుమారుడు రోజు ఆస్ప‌త్రికి వ‌చ్చి వెళ్లేవాడు. ఆస్ప‌త్రిలో రేడియోగ్రాఫ‌ర్ ఉమామ‌హేశ్వ‌ర్ ఆ మ‌హిళ‌ల‌కు దూర‌పు బంధువు. దీంతో వారు అత‌డితో మాట్లాడేవారు. ఈ నెల 8 నుంచి అక్కాచెల్లెళ్లిద్ద‌రూ క‌నిపించ‌డం లేదు. రోగి కుమారుడు వెళ్లి ఉమామ‌హేశ్వ‌ర్‌ను నిల‌దీయ‌గా.. ఎక్క‌డ ఉన్నారో చూద్దామంటూ ఆదివారం సాయంత్రం ఆస్ప‌త్రి అంతా తిప్పాడు. ఓ చోట శ‌రీరంపై అరొక‌ర దుస్తుల‌తో అప‌స్మార‌క స్థితిలో ఉన్న పిన్ని క‌నిపించింది. ఆమెకు స‌ప‌ర్య‌లు చేసి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు తీసుకువెళ్లారు. అక్క‌డ ఆమె జరిగిన దారుణాన్ని చెప్పింది.

ఉమామ‌హేశ్మ‌ర్ ఈ నెల 8న ఆ మ‌హిళ‌ల‌ను ఓ గ‌దిలోకి తీసుకెళ్లి క‌ల్లులో మ‌త్తుమందు క‌లిపి తాగించాడ‌ని తెలుస్తోంది. వారు అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిన త‌రువాత ఉమామ‌హేశ్వ‌ర్ తో పాటు మ‌రికొంద‌రు వారిపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఎవ‌రికైనా చెబితే.. చంపేస్తామంటూ బెదిరించారు. మ‌రుస‌టి రోజు వారిద్ద‌రిని చీక‌టి గ‌దిలోకి తీసుకెళ్లి మ‌రోసారి అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. కర్చీఫ్‌లో మత్తుమందు స్ప్రే చేసి నోటికి అదిమిపెట్టార‌ని..న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల‌కు తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

కాన‌రాని మ‌రో బాధితురాలి ఆచూకీ..

దాంతో సోమ‌వారం ఈ ఘ‌ట‌న‌పై మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు య‌త్నించ‌గా.. హైద‌రాబాద్‌లోనే ఫిర్యాదు చేయాల‌ని చెప్ప‌డంతో చిల‌క‌ల‌గూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ఉమామ‌హేశ్వ‌ర్‌తో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. అత్యాచార బాధితుల్లో మ‌రో బాధితురాలి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐదు రోజులుగా ఉమామహేశ్వర్‌ సరిగా విధులకు హాజరు కావడం లేదని విచారణలో తేలింది. మరోవైపు ఈ ఘటనపై ఆస్పత్రి ఆర్‌ఎంవోలు, ఇతర వైద్యులతో విచారణకు ఆదేశించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజలింగం తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ పరిశీలిస్తున్నామన్నారు. విచారణ అనంతరం దోషులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Next Story