సిమ్ కార్డుల దందా.. హైదరాబాద్‌లో ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్
ముందుగా యాక్టివేట్ చేయబడిన ఎయిర్ టేల్ సిమ్ కార్డులను కొనుగోలు చేయడం, విక్రయించడంలో ఓ ముఠా ఆరితేరింది.
By అంజి Published on 30 Aug 2024 8:49 AM GMTసిమ్ కార్డుల దందా.. హైదరాబాద్‌లో ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్
ఇంజనీరింగ్ చదివి మంచి ఉద్యోగం చేశాడు.. నెల తిరిగే సరికి మంచి సంపాదన.. అయినా తన జల్సాలకు సరిపోవడం లేదంటూ ఉద్యోగం మానేసి బిజినెస్ చేశాడు. అందులోనూ నష్టం రావడంతో సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించాలని ఆలోచించాడు. దీంతో సీమ్ కార్డుల దందాకు తెరలేపాడు.. చివరకు పోలీసుల చేతికి చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు.
ముందుగా యాక్టివేట్ చేయబడిన ఎయిర్ టేల్ సిమ్ కార్డులను కొనుగోలు చేయడం, విక్రయించడంలో ఓ ముఠా ఆరితేరింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే అబిడ్స్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ముందస్తుగా యాక్టివేటేడ్ చేసిన ఎయిర్టెల్ సిమ్ కార్డులను సేకరించి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సూరా వెంకటేష్, ఎన్ ఇమామ్ సద్దాం హుస్సేన్, దానం విజయ్ కుమార్, జి గోవర్ధన్, బాలకృష్ణన్ మణికందలను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 1748 సిమ్ కార్డులు, ఏడు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.. ఈ సరికొత్త దందాకు తెరలేపిన ప్రధాన సూత్రధారుడు ఎవరో కాదండోయ్ సాఫ్ట్వేర్ ఇంజనీరే.
నెల్లూరు జిల్లాలోని గూడూరు మండలానికి చెందిన సురా వెంకటేష్ అలియాస్ వెంకీ (35) అనే యువకుడు బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేశాడు. కానీ ఉద్యోగం తృప్తికరంగా లేకపోవడంతో 2022లో ఉద్యోగం మానేసి హోల్ సేల్‌గా నిమ్మకాయల వ్యాపారం చేశాడు. కానీ అందులో నష్టాలు వచ్చాయి. అనంతరం వెంకటేష్ సోషల్ మీడియా ద్వారా ఫ్రీ యాక్టివే టెడ్ సిమ్ కార్డుల డిమాండ్ గురించి తెలుసుకున్నాడు. దీంతో వెంకటేష్ ఫ్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డుల దందా కొనసాగించడానికి ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే వెంకటేష్‌కు నల్ల ఇమామ్ సద్దాం హుస్సేన్(28) తో పరిచయం ఏర్పడింది.
సద్దాం హుస్సేన్ కడపలోని బుద్వేల్‌లో సిమ్ కార్డులు విక్రయిస్తున్న వ్యాపారాన్ని నిర్వహించేవాడు. వెంకటేష్ తనకు పెద్ద మొత్తంలో సిమ్ కార్డులు కావాలని సద్దాం హుస్సేన్‌ను అడిగాడు. ప్రతి వ్యక్తి రెండు సిమ్ కార్డులను ఆధార్ కార్డులపై పొందవచ్చు. ఈ నిబంధన ఉన్నందున సద్దాం హుస్సేన్ సిమ్ కార్డులను కొనుగోలు చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు. తన షాప్ కి వచ్చే కస్టమర్లకు ఐడిని ఉపయోగించి రెండు సిమ్ కార్డులు తీసుకొని అందులో ఒకటి కస్టమర్లకు ఇచ్చి మరొక సిమ్ కార్డును వెంకటేష్ కు 400 రూపాయల చొప్పున అమ్మేవాడు. ఇలా ఒక్కొక్క సిమ్ కార్డు 400 చొప్పున వెంకటేష్ వాటిని కొనుగోలు చేసే వాడు.
ఈ విధంగా సద్దాం హుస్సేన్ ఇప్పటివరకు దాదాపు 2000 ఫ్రీ ఆక్టివేటెడ్ ఎయిర్టెల్ సిమ్ కార్డులను వెంకటేష్ కు అందజేశాడు. వెంకటేష్ ఆ విధంగా తీసుకున్న సిమ్ కార్డులను కాంబోడియా దేశంలో కాల్ సెంటర్ నడుపుతున్న రాజేష్ కు ఒక్కొక్క సిమ్ కార్డు 800 రూపాయలకు అమ్ముతూ సులభ పద్ధతిలో డబ్బులు సంపాదిస్తున్నాడు. ఈ విధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంకటేష్ మరో నలుగురితో కలిసి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలోని డిస్ట్రిబ్యూటర్ల నుండి పెద్ద మొత్తంలో సిమ్ కార్డులను కొనుగోలు చేశారు.
విశ్వసనీయ సమాచారం మేరకు అబిడ్స్ లోని మార్జన్ హోటల్ సమీపంలో ఇంజనీర్ సురా వెంకటేష్ తో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 1748 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.