భార్యపై అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురు సహోద్యోగులను కాల్చి చంపిన పోలీస్
Sikkim Cop Shoots Dead 3 Colleagues In Delhi For Comments Against Wife. తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వేధింపులకు గురి చేస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ పోలీస్ తన
By అంజి
తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వేధింపులకు గురి చేస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ పోలీస్ తన సహోద్యోగులు ముగ్గురిని కాల్చి చంపారు. తన ఐఎన్‌ఎస్‌ఏఎస్ రైఫిల్‌తో 7-8 రౌండ్లు కాల్చాడు. ఈ ఘటన ఢిల్లీలోని నార్త్‌వెస్ట్ జిల్లాలోని హైదర్‌పూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో జరిగింది. ప్లాంట్‌లో భద్రత కోసం నలుగురు ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్‌బి) సిబ్బందిని మోహరించినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఘటన జరిగిన తర్వాత నిందితుడు ప్రబీణ్ రాయ్ (32) నేరుగా సమయపూర్ బద్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
ప్రబీణ్ రాయ్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరోకరు కోన ఊపిరితో ఉన్న సమయంలో ఆస్పత్రికి తరలించబడ్డారు. అయితే అప్పటికే అతడు మరణించాడని వైద్యులు తెలిపారు. చనిపోయిన వారిని సిక్కిం పోలీసు విభాగానికి చెందిన పింటో నమ్‌గ్యాల్ భూటియా, ఇంద్ర లాల్ ఛెత్రి, ధన్‌హాంగ్ సుబ్బాగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసి మానసికంగా వేధింపులకు గురిచేయడం వల్లే తాను వారిని కాల్చినట్టు నిందితుడు ప్రబీణ్ రాయ్ వెల్లడించాడని పోలీసులు తెలిపారు.
ప్రబీణ్ రాయ్ మరో పోలీసును కూడా కాల్చబోయాడు. అయితే అతను వెనుక కిటికీ నుంచి తప్పించుకోగలిగాడు. ప్రాథమిక దర్యాప్తులో ముగ్గురు సహచరులు తన భార్య గురించి అసభ్యకరంగా మాట్లాడటంతో పాటు, తనను మానసికంగా వేధించారని రాయ్ పోలీసులకు తెలిపారని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా & ఆర్డర్) దేవేంద్ర పాఠక్ తెలిపారు.
హైదర్‌పూర్ వాటర్ ప్లాంట్‌లో కాల్పుల ఘటనపై రోహిణి సెక్టార్ 13లోని కెఎన్ కట్జు మార్గ్ పోలీస్ స్టేషన్‌కు కాల్ వచ్చిందని డిప్యూటీ కమీషనర్ పోలీస్ (రోహిణి) ప్రణవ్ తాయల్ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం సిక్కిం పోలీసులకు చెందిన ముగ్గురు వ్యక్తులపై కాల్పులు జరిపినట్లు గుర్తించింది. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను వచ్చేలోగా మరణించినట్లు ప్రకటించారు."అని తాయల్ చెప్పారు.