సైకో కిల్ల‌ర్ అరెస్ట్.. భార్య‌పై కోపం.. మ‌హిళ‌లే అత‌డి టార్గెట్‌

Serial killer nabbed in Visakhapatnam.విశాఖ జిల్లా పెందుర్తిలో క‌ల‌క‌లం రేపిన వ‌రుస హ‌త్య‌ల మిస్ట‌రీని పోలీసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Aug 2022 4:03 AM GMT
సైకో కిల్ల‌ర్ అరెస్ట్.. భార్య‌పై కోపం.. మ‌హిళ‌లే అత‌డి టార్గెట్‌

విశాఖ జిల్లా పెందుర్తిలో క‌ల‌క‌లం రేపిన వ‌రుస హ‌త్య‌ల మిస్ట‌రీని పోలీసులు ఛేదించారు. వారం రోజుల వ్య‌వ‌ధిలో మూడు హ‌త్య‌లు జ‌ర‌గ‌డంతో ఈ కేసుల‌ను చాలా సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు సైకో కిల్ల‌ర్ రాంబాబు ఈ హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. కుటుంబానికి దూరం కావడంతో నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని, మహిళలను హత్యలు చేయడమే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. అన‌కాప‌ల్లి జిల్లా న‌ర్సీప‌ట్నం మండ‌లం ధ‌ర్మ‌సాగ‌రానికి చెందిన రాంబాబు(49) 2006లో భార్య‌, కుమారుడు, కుమారైతో క‌లిసి హైద‌రాబాద్ వెళ్లి రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌లో ఏజెంట్‌గా చేరారు. అయితే.. అక్క‌డ బిల్డ‌ర్ మోసం చేయ‌డంతో కుటుంబాన్ని అక్క‌డే ఉంచి కొన్నాళ్లు విశాఖ‌లో ప‌ని చేశాడు. 2018లో రాంబాబు భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం చూసి తట్టుకోలేక పోయిన నిందితుడు భార్యకు విడుకులు ఇచ్చాడు. పిల్ల‌లు సైతం రాంబాబును దూరం పెట్టారు.

పెందుర్తిలో ఓ అద్దె ఇంట్లో నివ‌సించ‌గా.. అత‌డి ప్ర‌వ‌ర్త‌న బాగాలేక‌పోవ‌డంతో ఇంటి య‌జ‌మాని అత‌డిని ఖాళీ చేయించాడు. భార్య వివాహేత‌ర సంబంధం వ‌ల్ల రాంబాబు తీవ్ర ఒత్తిడికి లోనై మాన‌సికంగా కుంగిపోయి మ‌హిళా ద్వేషిగా మారాడు. అప్ప‌టి నుంచి అత‌డు హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నాడు. జూలై 9న రాత్రి పెందుర్తి బృందావ‌న్ గార్డెన్స్‌లో అపార్టుమెంట్ వాచ్‌మెన్ టి.న‌ల్ల‌మ్మ‌పై దాడి చేయ‌డంతో ఆమె గాయాల‌పాలైంది. ఆగ‌స్టు 8న చిన‌ముషివాడ‌లో అపార్ట్‌మెంట్ కాప‌లాదారులుగా ఉన్న అప్పారావు, ల‌క్ష్మీల‌ను రాడ్‌తో కొట్టి చంపాడు. ఆగ‌స్టు 14న సుజాత‌న‌గ‌ర్ నాగ‌మ‌ల్లి లేవుట్‌లో వాచ్‌మ‌న్ ఎ.ల‌క్ష్మీని హ‌త్య చేశాడు.

చీక‌టిలోనే హ‌త్య‌లు చేయ‌డంతో.. ఆ చంపిన వాళ్ల‌లో మ‌హిళ‌లు ఉన్నారా లేరా అనేది తెలుసుకునేందుకు వారి ప్రైవేటు భాగాల‌ను చెక్ చేసి వాటిపైనే త‌న్నేవాడు. ఆదివారం హ‌త్య జ‌రిగిన ప్రాంతంలో పోలీసులు నిఘా పెట్ట‌గా.. పొద‌ల్లోంచి వస్తున్న రాంబాబును ప్ర‌శ్నించ‌గా పొంత‌న లేని స‌మాధానాలు చెప్పాడ‌ని, అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించ‌గా విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయ‌న్నారు. అత‌డిని కోర్టులో హాజ‌రు ప‌రిచి క‌స్ట‌డీలోకి తీసుకుని విచార‌ణ జ‌రుపుతామ‌న్నారు.

Next Story