తల్లి కోసం పదే పదే ఏడ్చి.. హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య

బాచుపల్లిలోని నారాయణ జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని కళాశాలలో

By అంజి  Published on  14 Jun 2023 7:00 AM IST
suicide, inter student, Bachupally, Crime news

తల్లి కోసం పదే పదే ఏడ్చి.. హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ : బాచుపల్లిలోని నారాయణ జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని కళాశాలలో చేరిన నాలుగు రోజులకే కళాశాల ఆవరణలో మంగళవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం 8.40 గంటలకు బాలిక కడుపునొప్పి అంటూ కెమిస్ట్రీ క్లాస్‌ నుంచి బయటకు వచ్చి.. భవనంలోని ఐదో అంతస్తు నుంచి దూకేందుకు వెళ్లడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. 16 ఏళ్ల బాలిక గ్రామీణ, వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినదని, తన తల్లి కోసం పదేపదే ఏడుస్తూ ఉండటంతో హాస్టల్ జీవితంలో సర్దుబాటు చేయలేకపోయిందని బాలిక హాస్టల్ మేట్‌లు తెలిపారు. ఆమె జూన్ 9వ తేదీన హాస్టల్‌లో చేరిందని వారు తెలిపారు.

ఇటీవలే హాస్టల్‌లో చేరిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు ఉదయం 9.40 గంటలకు నారాయణ కాలేజీ యాజమాన్యం నుంచి మాకు ఫోన్‌ వచ్చిందని బాచుపల్లి పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎన్.సుమన్ కుమార్ తెలిపారు. ఒక హాస్టల్ మేట్‌ మాట్లాడుతూ.. "మేము ఆ అమ్మాయిని మొదటి రోజు జూన్ 9 మధ్యాహ్నం కలుసుకున్నాము. ఆమె లగేజీని మార్చడానికి సహాయం చేసాము, తరగతులు, సమయాల గురించి ఆమెకు వివరించాము. ఆమె గదికి తీసుకెళ్లాము. మొదటి రోజు నుండి ఆమె విచారంగా ఉంది. లంచ్ అవర్‌లో ఆమె చాలా సార్లు ఏడ్చింది" అని చెప్పింది.

ఆమె బంధువు అయిన మరో క్లాస్‌మేట్ ఇలా చెప్పింది: "మొదట్లో, ఆమె హాస్టల్ జీవితానికి సర్దుబాటు చేసుకోవడానికి రెండు రోజులు అవుతుందని మేము అనుకున్నాము, కానీ ఆమె తన తల్లి, సోదరుడిని కోల్పోతున్నట్లు చెబుతూనే ఉంది. మేము ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించాము, కానీ ఆమె ఇంటికి వెళ్ళడానికి నిరాశగా ఉంది." భూమిని అమ్మి.. ఆమెను తండ్రి కాలేజీలో చేర్పించాడని, ఆమె కొత్త జీవితానికి సర్దుకుని ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ధీమాగా ఉన్నాడని, ఇంతలో ఇలా జరిగిందని 16 ఏళ్ల బాలిక మేనమామ చెప్పాడు.

ఆమె తండ్రి ఎనిమిదేళ్లుగా కూలీగా పనిచేశారని, లేబర్ వీసాపై దుబాయ్‌లో పనిచేస్తున్నారని తెలిపారు. ఆయన బుధవారం దేశానికి చేరుకుంటారని మామయ్య తెలిపారు. బాలిక తల్లి తీవ్ర మనోవేదనకు గురైందని, మార్చురీలో తన కుమార్తె మృతదేహాన్ని చూసినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదని మామ తెలిపారు. బాచపల్లి పోలీసులు కళాశాల యాజమాన్యం, బాలిక రూమ్‌మేట్స్‌ వాంగ్మూలాలను నమోదు చేసి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఈ ఘటనతో కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ, నవ తెలంగాణ విద్యార్థి శక్తి కార్యకర్తలు నారాయణ కాలేజీ వద్ద ధర్నాకు దిగారు. ఆమె మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని నవ తెలంగాణ విద్యార్ధి శక్తి రాష్ట్ర అధ్యక్షుడు ఇ.పవన్‌కుమార్‌ అన్నారు.

Next Story