Secunderabad: విషాదం.. కూతుళ్లను చంపి తండ్రి ఆత్మహత్య
సికింద్రాబాద్ బోయినపల్లి భవాని నగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 13 Oct 2023 9:25 AM ISTSecunderabad: విషాదం.. కూతుళ్లను చంపి తండ్రి ఆత్మహత్య
సికింద్రాబాద్ బోయినపల్లి భవాని నగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా పలువురిని కంటతడి పెట్టించింది. భార్య భర్తల మధ్య సర్వసాధారణంగా గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే కొందరు చిన్న చిన్న విషయాలకే మనస్తాపం చెంది తీవ్ర నిర్ణయాలు తీసుకుని అమూల్యమైన జీవితాన్ని ముగించుకుంటున్నారు. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. తాజాగా బోయిన్‌పల్లిలోని భవాని నగర్ లో నివాసం ఉంటున్న శ్రీకాంత్ అనే వ్యక్తికి భార్య కూతుళ్లు శ్రావ్య (7) స్రవంతి (8) అని ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకు న్నాడు.
అయితే తాను ఆత్మహత్య చేసుకుంటే తన ఇద్దరు పిల్లలు బతకడం కష్టమవుతుందని భావించిన ఆ తండ్రి తనతో పాటు వారిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ స్లీపింగ్ టాబ్లెట్లు తెచ్చి తన ఇద్దరు కూతుళ్లకు వేశాడు. వారిద్దరూ మృతి చెందినట్లుగా నిర్ధారణ చేసుకున్న అనంతరం శ్రీకాంత్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఓ తండ్రి ఇద్దరు కూతుళ్లు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీకాంత్ భార్య తన భర్త, ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో ఆమె రోదన పలువురి హృదయాలను కదిలించివేసింది.