ఉదయాన్నే పాఠశాల గేటు తెరచి చూడగా.. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు షాక్
School principal's body found hanging in classroom.యూపీలోని హమీర్‌పూర్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి
By తోట వంశీ కుమార్ Published on 20 Jan 2023 7:59 AM IST
యూపీలోని హమీర్‌పూర్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉదయం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గేటు తెరిచి లోపలికి వెళ్లి చూడగా.. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అందరూ నివ్వెరపోయారు. ఒక గదిలో పాఠశాల ప్రిన్సిపాల్ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
జిల్లాలోని సరిలా బ్లాక్‌లోని ఉపరంఖా గ్రామంలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో కంధౌలి గ్రామానికి చెందిన సుగ్రీవ శ్రీవాస్ (55) ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం పాఠశాల తెరవగా.. తరగతి గదిలో శ్రీవాస్ ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సమస్యలతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు బావిస్తున్నారు.
పాఠశాల సహాయ ఉపాధ్యాయుడు రవీంద్ర మాట్లాడుతూ.. ఇంటి సమస్యలతో ప్రిన్సిపాల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, సోమవారం కూడా ఏడుస్తున్నారని చెప్పాడు. మంగళవారం వచ్చాడు కానీ రోజంతా ఎవరితోనూ మాట్లాడలేదు. రోజంతా స్కూల్ మైదానంలో ఒంటరిగా కూర్చున్నాడు. పాఠశాల సమయం ముగియడంతో అందరం ఇంటికి వెళ్లాం. అయితే.. సాయంత్రం తన తండ్రి ఇంటికి రాలేదని సుగ్రీవ కుమారుడు నాకు ఫోన్ చేశాడు. ఇద్దరం కలిసి మొత్తం వెతికాం. అయితే.. అతడు ఎక్కడ ఉన్నాడు అనే విషయం తెలియరాలేదు. బుధవారం ఉదయం పాఠశాల తెరువగా సుగ్రీవ మృతదేహం కనిపించిందని చెప్పాడు.
పాఠశాలలో ప్రిన్సిపాల్ మృతదేహం లభ్యం కావడంతో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ప్రిన్సిపాల్ ఆత్మహత్యకు గల కారణాలేవీ ఇప్పటి వరకు బయటకు రాలేదు.