సింగరేణి కార్మికుడిని కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు

SCCL worker shot dead in Godavarikhani. గోదావరిఖని గంగానగర్‌లో శనివారం తెల్లవారుజామున సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్

By Medi Samrat
Published on : 20 Aug 2022 9:30 PM IST

సింగరేణి కార్మికుడిని కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు

గోదావరిఖని గంగానగర్‌లో శనివారం తెల్లవారుజామున సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) కార్మికుడు కొరకొప్పుల రాజేందర్ (35)ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హెల్మెట్ ధరించి రాజేందర్ నివాసంలోకి ప్రవేశించి కంట్రీ మేడ్ పిస్టల్‌తో కాల్చారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రవళి వాష్‌రూమ్‌లోకి వెళ్లగా.. తెల్లవారుజామున 2 గంటల సమయంలో దుండగులు రెండు బైక్‌లపై సంఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లోకి ప్రవేశించారు.

రాజేందర్ మంచంపై నిద్రిస్తున్న సమయంలో వారు అతనిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. రాజేందర్ మృతి చెందినట్లు నిర్ధారించుకున్న‌ వారు అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతంలోని ఆర్కే-7 బొగ్గు గనిలో జనరల్ మస్దూర్‌గా పనిచేస్తున్నాడు. ఘటనా స్థలాన్ని గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌, సీఐలు రమేష్‌బాబు, రాజ్‌కుమార్‌ సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును విచారించేందుకు పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.


Next Story