హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపారాయుడు నగర్‌లోని హర్ష లుక్స్ సెలూన్ యజమాని అశోక్‌ని గుర్తుతెలియని కొందరు దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. అంతే కాకుండా దుండగులు పోలీసుల చేతికి చిక్కకుండా సెలూన్‌లోని సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేసి అక్కడి నుండి పరారయ్యారు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో.. తన సెల్ ఫోన్‌కి ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో అతని భార్య, కుమారులకు అనుమానం వచ్చి సెలూన్ వద్దకు వచ్చి సెలూన్ షట్టర్‌ని పైకి లేపి చూడగా అశోక్ రక్తం మడుగులో పడి ఉన్నాడు. ఇది చూసిన అతని భార్య, పిల్లలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.
సెలూన్ షాపు యజమాని అశోక్ భార్య వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. అశోక్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కూకట్ పల్లి పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తున్నారు. పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేట్‌ను సేకరించే పనిలో పడ్డారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. అశోక్‌ని ఎవరు హత్య చేశారు. ఎందుకు హత్య చేశారు. అతనికి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? అని పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.